జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నిన్న శాసనమండలి వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వ్యాఖ్యల వెనుక బయటకు చెప్పుకోలేని ఆమె బాధ ఎంతో దాగుందని కొందరు సానుభూతి చూపిస్తుంటే.. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదని.. అధికారం దూరం అయ్యాకే కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి, తప్పులను ఎత్తిచూపుతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదంతా ప్రజల్లో రాజకీయ సానుభూతిని రగిలించడానికేనా అని ప్రశ్నిస్తున్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత వివిధ పదవులను అనుభవించారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా..2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ ఆమెను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కొలువుదీరిన కేసీఆర్ తొలి ప్రభుత్వంలో కవితకు మంత్రి పదవి దక్కలేదు.కానీ, జాగృతి పేరిట ఆమె నిర్వహించిన కార్యక్రమాలు, బతుకమ్మ పండుగ సమయంలో తెలంగాణ, విదేశాల్లో ఆటపాటల పేరిట ఓ మంత్రి ఎలాగైతే ఉత్సవాలు నిర్వహించగలరో అంతకుమించే చేసింది. ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఉత్సవాలకు ప్రభుత్వం కేటాయించేది. అవన్నీ ఆమె చేతుల మీదుగానే జరిగేవని పలువురు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక ఎంపీగా ఉన్న సమయంలో ఆమె హవా వేరే ఉండేదని, సీనియర్లు కూడా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక కేసీఆర్ బిడ్డ అని వాళ్లు కూడా ఆమెను పెద్దగా విమర్శించలేదని టాక్.
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ పార్టీలో పదవుల పంచాయితీ నడించినట్టు అప్పట్లోనే పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఎంపీగా ఓడిన కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీ కట్టబెట్టారు. అయితే, తనకు మంత్రి పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కావాలని ఆమె పట్టుబట్టినట్టు పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. అక్కడే కవితకు, కేటీఆర్ భేదాభిప్రాయాలు వచ్చినట్టు టాక్. ఇక హరీశ్ రావు సైతం పార్టీలో కవిత పెత్తనాన్ని తగ్గించేందు పావులు కదిపి సక్సెస్ అయ్యారని టాక్ ఉన్నది. కవిత జరుపుతున్న మంతనాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేసీఆర్ పరువు పోవడం, కవిత అరెస్టు.. తీహార్ జైలు జీవితం.. ఆమెను విడిపించడానికి బీజేపీతో కాళ్ల బేరానికి రావడం ఇదంతా అటు కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్‌కు తలనొప్పిగా మారాయని పార్టీలో జోరుగా చర్చజరిగింది.
‘జల’జగడం.. ఏపీ, తెలంగాణలో గందరగోళం!
తీరా చూస్తే 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కుటుంబ గొడవలు మరింత ముదిరాయి. పార్టీకి వ్యతిరేక లైన్ తీసుకున్న కవితను సస్పెండ్ చేయడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని నిన్న మండలి చైర్మన్‌కు విజ్ఞప్తి చేశాక భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, తనను పార్టీలో ఎవరెవరు ఎలా ఇబ్బంది పెట్టారు? తన భర్త ఫోన్ ట్యాప్, ప్రాజెక్టులు, కలెక్టరేట్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గొంతెత్తారు. త్వరలోనే పార్టీపెడతానని.. వ్యక్తిగా వెళ్తున్నానని.. శక్తిగా మళ్లీ చట్టసభల్లో అడుగుపెడతానని అన్నారు. తన బిడ్డల మీద ఒట్టేసి చెబుతున్నా.. తన గొడవ ఆత్మగౌరవం కోసమని.. ఆస్తుల గురించి కాదని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, కవిత తొలి హిట్ లిస్టులో ఉన్నది హరీశ్ రావు, ఆ తర్వాత కేటీఆర్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.