iBomma: స్వేచ్ఛ బ్యూరో: కంచికి చేరిందనుకున్న ఐ బొమ్మ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇమంది రవి అరెస్ట్ తో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఈ వెబ్ సైట్ మళ్లీ ప్రత్యక్షమయ్యింది. అదీ.. లేటెస్ట్ గా విడుదలైన సినిమాలతో. దాంతో ఫిలిం చాంబర్ వర్గాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఐ బొమ్మ… బప్పం వెబ్ సైట్లు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన గంటల్లోనే సినిమాలు ఈ వెబ్ సైట్లలో ప్రత్యక్షమయ్యేవి. రూపాయి ఖర్చు లేకుండా లేటెస్ట్ సినిమాలు చూసే అవకాశం ఉండటంతో లక్షల మంది ఈ వెబ్ సైట్లకు అభిమానులుగా కూడా మారారు.
కోట్లు ఖర్చు చేసి తీస్తున్న సినిమాల పైరసీ వర్షన్ వెబ్ సైట్లలో వస్తుందటంతో టాలీవుడ్ వర్గాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు గత ఏడాది ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు పైరసీ చేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. దీనిని ఛాలెంజ్ గా తీసుకున్న సైబర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఐ బొమ్మ.. బప్పం వెబ్ సైట్లు కనిపించకుండా పోయాయి. దాంతో టాలీవుడ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, తాజాగా మరోసారి ఈ రెండు వెబ్ సైట్లు ప్రత్యక్షం అయ్యాయి. అదికూడా లేటెస్ట్ గా విడుదలైన సినిమాలతో. ఈ పరిణామం మరోసారి చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది.
Also Read: కొల్లాపూర్ మార్కెట్ యార్డులో మంత్రి జూపల్లి.. ఆర్థిక సహాయం అందజేత!
ఈ క్రమంలో ఫిలిం చాంబర్ ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు ఐ బొమ్మ.. బప్పం వెబ్ సైట్ల నిర్వాహకులు ఎవరన్నది గుర్తించే దిశగా విచారణ ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ల సర్వర్లు ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి? ఎవరు వీటి వెనక ఉన్నారు? అన్నది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అరెస్ట్ అయిన ఇ మంది రవి బెయిల్ పై విడుదలైన కొంతకాలానికే ఈ రెండు వెబ్ సైట్లు ప్రత్యక్షం కావటం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులు ఇమంది రవిని ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
Also read: బండి సంజయ్ కొంపముంచిన సొంత ముఠా.. భగీరథ కేసులో అసలు గుట్టు ఇదే!