Medigadda Barrage: తెలంగాణలో ప్రాజెక్టులను తామే నిర్మించామంటూ చీటికీ మాటికీ మీడియా ముందుకొచ్చి రీసౌండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆనాటి ప్రభుత్వం చేసిన లోపాలను బయటపెట్టింది ఐఐటీ స్టడీ. మేడిగడ్డ బ్యారేజీ అదొక లోపాల పుట్టగా మారిందని ప్రస్తావించింది. డిజైన్లు, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ పరిశోధన సరిగా చేయలేదని తేల్చేసింది. ఇంకా నివేదికలో ఏయే అంశాలు ప్రస్తావించిందంటే..
కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. వచ్చేనెల చివరి నాటికి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈలోగా ఆనాటి ప్రభుత్వ పెద్దలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల, హరీష్‌రావులను విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కమిషన్ రిపోర్టు రెడీ చేసినా మరోసారి క్రాస్ చేస్తోంది. ఘోష్ కమిషన్ నుంచి రేపో మాపో ఆయా నేతలకు పిలుపు రానుంది.
ఇదిలావుండగా మేడిగడ్డ బ్యారేజీపై ఐఐటీ రూర్కీ రిపోర్టు బయటకు వచ్చింది. ప్రాజెక్టు లోపాల గురించి అనేక అంశాలు ప్రస్తావించింది. ప్రాజెక్టు డిజైన్ల నుంచి ముగిసేవరకు ఎక్కడెక్కడ తప్పు చేసిందీ అనే అంశాలను బయటపెట్టింది. ఐఎస్ కోడ్స్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ పరిశోధన నిర్వహించలేదని పేర్కొంది. బ్యారేజీ ఏడో బ్లాకులో 11 గేట్లు ఉన్నాయి. కానీ ఐదు గేట్ల వరకు మాత్రమే టెస్టులు చేశారని ప్రస్తావించింది.
మరో ముఖ్యమైన అంశం బయటపెట్టింది. బ్యారేజీ ఫౌండేషన్ సీకెంట్ పైల్స్‌ను సరిగ్గా నిర్మించలేదు. దిగువన రాఫ్ట్, పైల్స్‌కు మధ్య కనెక్షన్ లేక రంధ్రాలు పడ్డాయి. చివరకు లీకేజీకి దారి తీసిందని తేల్చేసింది. ఇసుక సెడిమెంటేషన్ తోపాటు మరికొన్ని స్టడీస్ చేయలేదని అందులో ప్రస్తావించింది.
ALSO READ: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఇందిరమ్మ ఇళ్లు గురించి
లాంచింగ్ ఆప్రాన్ మందం బ్యారేజ్ వరదలకు సరిపోదన్నది ఐఐటీ మాట. దిగువన ఒక మీటరు, ఎగువన 1.2 మీటర్ల మందంతో ఏర్పాటు చేశారని ప్రస్తావించింది. ఐఎస్ కోడ్స్ స్టాండర్స్ ప్రకారం కనీసం 1.86 మీటర్ల మందం లేదన్నది అందులో పేర్కొంది. ప్రాజెక్టు వేగంగా కట్టాలనే ఆలోచన తప్పితే, కొన్నింటికి ఎలాంటి స్టడీ చేయలేదన్నది మరో పాయింట్.
క్రాక్ ఫ్లో స్టడీస్ చేయలేదు. వరద ప్రవాహం ఎక్కువయ్యే కొద్దీ ముప్పు ఉంటుందని తేల్చింది. దీని ద్వారా దిగువన గుంతల పడే ప్రమాదం ఉంది. చివరకు గేట్లను కొద్ది ఎత్తులో తెరిచి వరదను విడుదల చేసినప్పుడు స్టిల్లింగ్ బేసిన్ పరిస్థితి ఎలా ఉంటుందో, దానికి సంబంధించిన పరీక్షను సైతం చేయలేదని వెల్లడించింది. మేడిగడ్డపై ఐఐటీ రిపోర్టును కమిషన్ పరిగణనలోకి తీసుకుని ఆనాటి పాలకులను ప్రశ్నించనుందని సమాచారం.