Mahabubnagar: కాలం మారింది.. 5, 10 రూపాయలకు హత్య చేసుకునే రోజులు వచ్చేశాయి. తాజాగా ఆస్తి కోసం తమ్ముడి భార్యని అత్యంత దారుణంగా చంపేశారు సొంత బావలు. సంచలనం రేపిన ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. అసలు ఘటన ఎలా జరిగింది? ఆస్తుల పంపకాల వెనుక కోణం ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా ఓబులాయపల్లికి చెందిన 28 సునీతకు కోయిలకొండ మండలానికి చెందిన బలరాంతో పుష్కర కాలం కిందట వివాహం జరిగింది. సునీత-బలరాం దంపతులకు రిషిక, శైలజ అనే ఇద్దరు కూతురు ఉన్నారు. ఈ మధ్యకాలంలో బలరాంకు మతిస్థిమితం సరిగా లేదు. దీంతో ఆస్తుల వ్యవహారం పంచాయతీ వరకు వెళ్లింది.
ఏడాది కిందట పంచాయతీ పెద్దల సమక్షంలో ఎకరన్నర భూమిని సునీత పేరిట పట్టా చేయించారు. ఇక్కడ వరకు స్టోరీ బాగానే నడిచింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. బలరాం ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒకరు పాండునాయక్, మరొకరు మన్యానాయక్‌లకు తమ్ముడికి ఆస్తి ఇవ్వడం నచ్చలేదు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలకు ప్లాన్ చేశారు. సరిగా కాపురం చేయనిచ్చేవారు కాదు, బలరాంను తమతో హైదరాబాద్‌కు తీసుకెళ్లేవారు.
జరుగుతున్న పరిణామాలను గమనించిన సునీత, పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో మరొక ఇల్లు వేరే ప్రాంతంలో నిర్మించారు. నెల రోజులుగా సునీత అక్కడే ఉంటోంది. బావలు మాత్రం.. భూమి ఇవ్వమని తేల్చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని పలుమార్లు బెదిరింపులకు దిగారు. బావల మాటలు లైటుగా తీసుకుంది సునీత. సోమవారం మధ్యాహ్నం మామ మాణిక్యనాయక్, ఇద్దరు బావలు మన్యనాయక్, పాండునాయక్, వారి భార్యలు సునీత ఇంటికి వచ్చారు.
ఆస్తుల విషయంలో సునీతతో మాటల యుద్ధం జరిగింది. అది కాస్త జఠిలం కావడంతో బయట ఉన్న సునీతను ఇంటిలోకి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న కత్తులతో ఆమె గొంతు కోశారు. అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు సునీత భర్త బలరాం హైదరాబాద్‌లో ఉన్నాడు. సునీత మృతి విషయాన్ని స్థానికులు ఆమె తండ్రికి కబురు పెట్టారు. అక్కడి వచ్చిన సునీత తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. సునీత మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైడ్రా బిగ్ షాక్.. ఫామ్‌హౌస్ ప్రహరీ గోడ కూల్చివేసిత!