Solar Power Projects: ఇందిరా మహిళాశక్తి పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. కానీ శాఖల మధ్య సమన్వయం ఆ ప్లాంట్లకు శాపమవుతోంది. భూసేకరణ కంప్లీట్ అయింది. భూమి ఇచ్చేందుకు సైతం దేవాదాయశాఖ అంగీకారం సైతం తెలిపింది. అయితే సోలార్ ప్లాంట్లను రెడ్కో(తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే పలుదఫాలుగా రెడ్కోతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే ఆ సంస్థ ద్వారా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ముందుకు సాగడం లేదని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇటు ఇంధనశాఖ మంత్రి, అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇద్దరు భేటీ అయి చర్చిస్తే తప్ప ఈ ప్లాంట్ల నిర్మాణం ముందుకు సాగేలా లేదు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. విద్యుత్తు రంగంలోనూ వారికి అవకాశం ఇచ్చి మహిళల శక్తిని చాటిచెప్పేందుకు సిద్ధమైంది. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను పెండింగ్ లేకుండా చెల్లించడం, ప్రభుత్వపరంగా అందించే ప్రోత్సాహంతో పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో రాణిస్తుండటంతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వారికి సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అప్పగించాలని భావించింది.
Also Read: Maharashtra: మహారాష్ట్రలో విషాదం.. సోలాపూర్ బేకరీ ఓనర్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సమన్వయంతో పనిచేసే గ్రామ సమాఖ్యకు ఒక మెగావాట్ సామర్థ్యం ఉన్న సోలార్ విద్యుత్ ఉత్పత్తిప్లాంటును అప్పగించబోతున్నట్లు ప్రభుత్వం సైతం పేర్కొంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల సాధికారత, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఆర్థికాభివృద్ధితోపాటు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ విప్లవానికి నాంది పలుకుతున్నట్లు ప్రకటించింది. దసరా నాటికి ప్లాంట్లు కంప్లీట్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. తొలుత ప్రతి జిల్లాలకు 2 పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావించింది. ప్రతి ప్లాంట్ ను 4 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు, ఒక్కో ప్లాంట్ 0.5 మెగావాట్ల ఉత్పత్తికి 1.50కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. 25ఏళ్ల అగ్రిమెంట్ సైతం చేసుకోవడం జరుగుతుందని. ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ ప్లాంట్లు మరింత దోహదపడతాయని అధికారులు సైతం పేర్కొన్నారు.
ఈతరుణంలో దేవాదాయశాఖ సైతం భూములను లీజుకు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి దేవాదాయశాఖ అధికారులు హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆలయ భూములను గుర్తించారు. సబ్ స్టేషన్లు 2 కిలో మీటర్లు దూరంలో ఉన్న ఆలయ భూమి 292.24 ఎకరాలు, 3 కిలోమీటర్ల పరిధిలో 399.36 ఎకరాలు, 4 కిలో మీటర్ల దూరంలో 11 ఎకరాలు, 5 కిలో మీటర్ల దూరంలో 15.32 ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే తొలి విడుతలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో(సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ) 284.09 ఎకరాలు ఆలయ భూములు ఉండగా 231.05 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది.
విద్యుత్ సబ్ స్టేషన్లకు 2 కిలో మీటర్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములనే తొలి విడుతగా ఎంపిక చేశారు. అయితే ఇందులో తొలి విడతగా 51 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఏర్పాట్లు సిద్ధంచేశారు. భూమి ఇచ్చిందుకు దేవాదాయశాఖ అధికారులు సముఖత వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీశాఖ పరిధిలోని సెర్ప్ మహిళా సంఘాలను సైతం ఎంపిక చేసింది. అయితే ఇందుకు సంబంధించి రెడ్కో అధికారులకు ప్రపోజల్ సైతం పంచాయతీరాజ్ అధికారులు పంపారు. అయితే రెడ్కో సంస్థ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని సమాచారం. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. సోలార్ ను ప్రోత్సహించాల్సి ఉంది. ప్లాంట్ల ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉంది.. సెర్ప్ అధికారులు సైతం మహిళలకు రుణం ఇచ్చేందుకు సిద్దంగా ఉంది..కానీ ఏర్పాటుకు ముందుకు రావాల్సిన రెడ్కో రాకపోవడంతో ప్లాట్ల నిర్మాణం ముందుకు సాగడం లేదని విశ్వసనీయ సమాచారం. రోడ్కో అడ్డంకితోనే మహిళలకు సోలార్ కల నెరవేరడం లేదనే ప్రచారం జరుగుతుంది.
ఇంధనవనరులశాఖ పరిధిలోనే రెడ్కో సంస్థ కొనసాగుతుంది. దీనికి భట్టి విక్రమార్క మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క ఉన్నారు.. ఈ సోలార్ ప్లాంట్ల నిర్మాణం ముందుకు సాగాలంటే ఇద్దరు మంత్రులు భేటి అయి చర్చిస్తే తప్పా ముందుకు సాగే పరిస్థితి లేదు. మరోవైపు విద్యుత్ శాఖ సైతం సోలార్ ప్లాంట్లతో ఉత్పత్తి అయిన విద్యుత్ ను కొనుగోలు చేస్తామని ముందస్తుగానే ఒప్పందం సైతం చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ కు ఎంత ధర ఇస్తారు.. ఎన్ని సంవత్సరాలు కొనుగోలు చేస్తారు? అనేదానిపైనా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా భవిష్యత్ లో ఏర్పాటు చేయబోయే మరిన్ని ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి ఇద్దరు మంత్రులు చొరవ తీసుకుంటారా? లేకుంటే ప్లాంట్ల నిర్మాణంను ఇలాగే కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తారా? అనేది చూడాలి. మహిళలు మాత్రం ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఎదురుచూస్తున్నారు.