హైదరాబాద్, స్వేచ్ఛ: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి నమూనాను ఎంపిక చేసి, మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టారు. చాలా ఇళ్లు నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్నాయి. 90 శాతం పనులు పూర్తయినవి కొన్ని, ఇంకొన్ని నిర్మాణం మధ్యలో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తగా, నిర్మాణం పూర్తయిన ఇళ్లపై తాజాగా కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
దసరా బొనాంజా
దసరా పండుగ లోపు పూర్తయిన డబులు బెడ్రూం ఇళ్లను అర్హులకు ఇస్తామన్నారు మంత్రి. 119 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్లను సైతం త్వరలోనే అర్హులు ఇస్తామని తెలిపారు. పింక్ మీడియాతో బీఆర్ఎస్ సామాన్య ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను పదేళ్లలో బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. రెండు సార్లు ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ వైఖరి మారలేదని మండిపడ్డారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు.
Also Read: కేటీఆర్ ఏకాకి అయ్యారా.. సమంత, అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ సపోర్ట్.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనం!
బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదు
మూసీ విషయంలో బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు పొంగులేటి. ఇప్పటికే 15వేల ఇళ్లను కేటాయించామని, అవసరమైతే ఇంకో 4వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్న ఆయన, బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. ఒకనాడు మూసీ కబ్జాలు తొలగించాలన్న కేటీఆర్ ఇప్పుడు మాటమార్చి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.