Sarpanch Elections: తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. గ్రామ స్థాయి పోరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలలో ఒక అనూహ్య పరిణామం ఇప్పుడు రాష్ట్రమంతటా హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా నామినేషన్ల ఘట్టం పూర్తి అవుతున్న వేళ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్ పదవికి పోటీ చేయడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం ఎంఐఎం ఎమ్మెల్యే కౌసిర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తాన్ ఈ సర్పంచ్ బరిలో నిలిచారు. ఆమె మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, బస్వాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి నాయకుల కుటుంబ సభ్యులు కార్పొరేటర్ లేదా ఉన్నత స్థానాలకు పోటీ చేస్తుంటారు. కానీ, ఒక ఎమ్మెల్యే భార్య మారుమూల గ్రామం సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం ప్రజలను ఆకర్షించింది. నజ్మా సుల్తాన్ కు రాజకీయ అనుభవం కొత్తేం కాదు. ఆమె గతంలో కార్వాన్ నియోజకవర్గం నుండి కార్పొరేటర్ గా కూడా పనిచేశారు. నగర రాజకీయాలపై ఆమెకు మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఆమె రూరల్ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సర్పంచ్ పదవి గ్రామీణ అభివృద్ధికి కీలకం కాబట్టి.. నజ్మా సుల్తాన్ బస్వాపూర్ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
గత ఎన్నికలలో ఎమ్మెల్యే కౌసిర్ మొహియుద్దీన్ కుమారులు రాజకీయ అరంగేట్రం చేశారు. సర్పంచ్ గా పోటీ చేశారు. వారు పోటీ చేసిన స్థానాలలో గెలవలేకపోయారు. కుటుంబం నుండి వచ్చిన పరాజయాల నేపథ్యంలో.. ఇప్పుడు నజ్మా సుల్తాన్ విజయంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సతీమణి బరిలో నిలవడంతో బస్వాపూర్ పంచాయతీ పోరు ఇప్పుడు సామాన్య ఎన్నిక వాతావరణాన్ని దాటిపోయింది. రాష్ట్ర స్థాయి మీడియా కవరేజ్ పొందుతోంది.
నజ్మా సుల్తాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ఎన్నికల ప్రచారం ఎలా ఉండనుంది..? గ్రామీణ ఓటర్లు ఆమెను ఎలా ఆదరిస్తారు? ఎమ్మెల్యే అండదండలతో ఆమె విజయం సాధిస్తారా..? అనేది చూడాలి. సర్పంచ్ పదవి స్థానిక ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. ఈ గ్రామీణ పోరాటంలో నజ్మా సుల్తాన్ ఎలాంటి ఫలితం సాధిస్తారో డిసెంబర్ 17 తరువాత తేలిపోనుంది. ఆమె విజయం సాధిస్తే, బస్వాపూర్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేదానిపై ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు.