MP Kiran Kumar: ఉపాధ్యాయుల సమస్యలపై భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ సమావేశంలో ఈరోజు ప్రస్తావించారు. టీఎస్ యూటీఎఫ్ (TSUTF) రాష్ట్ర నాయకులు అందించిన విజ్ఞప్తి మేరకు ఆయన సభ దృష్టికి ఈ కీలక అంశాన్ని తీసుకువచ్చారు. ఎస్టీఎఫ్ఐ (STFI) జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆదిమూలం వెంకట్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు (యాదాద్రి భువనగిరి) ముక్కెర్ల యాదయ్య ఇచ్చిన రిప్రెజెంటేషన్ ఆధారంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు.
2010 ఆగస్టు 23వ తేదీకి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ను అకస్మాత్తుగా తప్పనిసరి చేయడంపై ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అనేకసార్లు ఆ తేదీకి ముందు నియమితులైన వారికి టెట్ (TET) వర్తించదని స్పష్టం చేశాయి. ఈ హామీ కారణంగా లక్షలాది ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరు కాలేదు.
ఇప్పుడు రెండు సంవత్సరాల లోపు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయటం అన్యాయం అని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల వారికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని సభ దృష్టికి తెచ్చారు. వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్ సంక్షోభంలో పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల గురించి లోక్ సభలో మాట్లాడారు.
ఈ సమస్య తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని.. నియమితులైన ఉపాధ్యాయుల హక్కులను రక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు. అవసరమైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 (RTE Act 2009), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1993 (NCTE Act 1993) లలో తగిన సవరణలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ALSO READ: Mahesh Kumar: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కావాలనే రచ్చ చేస్తున్నారు… మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు