BigTV English

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

కవిత ఎగ్జిట్ తో బీఆర్ఎస్ ఒడ్డునపడిందా..? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పక్కనపెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీపై పడ్డ మచ్చ తొలగిపోతుందా? ప్రజల అభిప్రాయంలో మార్పు ఉంటుందో లేదో చెప్పలేం కానీ, రాజకీయంగా బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ సేఫ్ గేమ్ ఆడిందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీపై, అంటే బీఆర్ఎస్ నేతలపై చాలా ఆరోపణలున్నాయి. అయితే అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అధికారులే బలవుతున్నారు కానీ, ఇంకా నేతల అరెస్ట్ వరకు వ్యవహారం రాలేదు. రాగా పోగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే అప్పటి బీఆర్ఎస్ కీలక నేత కవిత అరెస్ట్ కావడం ఆ పార్టీకి తలవంపులుగా మారింది. అయితే ఇప్పుడు ఆ తలవంపులు కూడా తొలగిపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితకు బీఆర్ఎస్ కు సంబంధాలు లేవు. ఒకవేళ కవిత బీజేపీలో చేరితే ఆ పార్టీకే ఆ కలంకం అంటుకునే అవకాశం ఉంది.


జైలు శిక్ష?
నేరం రుజువు కాకపోయినా విచారణ ఖైదీగా జైలులో ఉండటం ఒకరకంగా కవితకు, కేసీఆర్ కుటుంబానికి పెద్ద శిక్షేనని చెప్పాలి. అయితే కవితను బయటకు తీసుకొచ్చే విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో ప్రయత్నాలు చేయలేదనే అపవాదు ఉంది. స్వయానా కవిత కూడా పార్టీ తనకు సహకరించలేదని అంటుంటారు. ఇప్పుడు పార్టీయే ఆమెను బయటకు పంపించింది కాబట్టి ఇకపై అలాంటి ఆరోపణలకు కూడా తావు లేదు. ఉద్యమ కాలంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్లకు వెళ్లొచ్చాం అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలకు లిక్కర్ కేసులో కవిత జైలు శిక్ష ఇన్నాళ్లూ ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది వారికి తొలగిపోయిందనే చెప్పుకోవాలి.

లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
లిక్కర్ స్కామ్ లో కవిత ముద్దాయి కాబట్టి, ఇకపై బీఆర్ఎస్ ని ఎవరూ ఆ స్కామ్ పేరుతో టార్గెట్ చేయలేరు. అలాగని కవిత పునీతురాలేమీ కాదు కాబట్టి.. ఆమెను ఆ కేసు ఇంకా వెంటాడుతుంటుంది. ఇంకా చెప్పాలంటే కవిత కొత్త పార్టీ పెట్టినా, కవిత ఇంకేదైనా పార్టీలో చేరినా ఆమెపై, ఆ పార్టీకే ఆ ముద్ర పడుతుంది. అయితే కవిత బీజేపీకి దగ్గరయితే మాత్రం ఆమె కేసు వ్యవహారంలో గెలిచేసినట్టే చెప్పుకోవాలి. ఢిల్లీ లిక్కర్ కేసు ఇక ముందుకు సాగే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ వద్ద ఉన్న ఏకైక కేసు అది. కవిత ఎగ్జిట్ తో ఆ కేసు భారం కూడా బీఆర్ఎస్ నుంచి తొలగిపోయింది కాబట్టి కేసీఆర్ సేఫ్ అని చెప్పుకోవాలి. రాగా పోగా మిగతా కేసుల వ్యవహారం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఎలాగూ రాజకీయ కక్షసాధింపు అంటూ సింపతీ డ్రామాలు ఆడే అవకాశం బీఆర్ఎస్ నేతలకు పుష్కలంగా ఉంది కాబట్టి ఆ విషయంలో వారికి ఇబ్బంది లేదు. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత భవిష్యత్ ఏంటనేది ఆమె చేరబోయే పార్టీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొత్త పార్టీ పెడితే మాత్రం ఆమె అన్నిటికీ సిద్ధపడి ముందుకు నడవాల్సి ఉంటుంది. కవిత టార్గెట్ బీజేపీ అనే వాదన బలంగా వినపడుతోంది. కొత్త పార్టీ పెట్టిన షర్మిల, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసి, తిరిగి అదే కాంగ్రెస్ లో చేరారు. మరి కవిత కొత్త పార్టీ పెట్టి ఇబ్బందులు పడి, ఆ తర్వాత జాతీయ పార్టీలతో కలుస్తారా, ముందుగానే ఆ పని చేస్తారా అనేది వేచి చూడాలి. మొత్తమ్మీద కవిత ఎగ్జిట్ తో బీఆర్ఎస్ ఓ భారాన్ని దించుకున్నట్టయింది.


Related News

CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!

Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్

T Fiber Net: తెలంగాణలో టీ-ఫైబర్‌.. దసరాకు మిస్సయితే, కార్తీకమాసం ఖాయం?

Big Stories

×