Mahesh Kumar: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. ఆంధ్ర ప్రాంత ప్రజలపై తమకు కోపం ఏమీ లేదని, తామంతా ప్రాంతాలుగా విడిపోయిన కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామకం, డీసీసీ అధ్యక్షుల నియామకాలు నిష్పక్షపాతంగా జరిగాయని.. ఈ నియామకాలపై ఎవరూ అసహనంతో లేరని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ సమర్థించారు. కోమటిరెడ్డికి బాధ కలిగి అలా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలు కరెక్టే అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ ఆడుతాయని.. ఇలాంటి సందర్భంలో ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని గౌడ్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రజలు సినీ రంగంలో ఆంధ్రా ప్రజలను ఎప్పుడూ దూరం పెట్టలేదని, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై మహేష్ కుమార్ గౌడ్ మరోసారి గట్టిగా నిలబడ్డారు. ఈ నియామకాల ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించామని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని ఆయన తెలియజేశారు. డీసీసీ పోస్టులు దక్కని నేతలు సైతం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అందరినీ కలుపుకొని పోతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన వివరించారు. టీపీసీసీ చీఫ్ హోదాలో, పార్టీ శ్రేణులకు, ప్రజలకు మధ్య సంబంధాలు మెరుగుపరచడం, ప్రతిపక్షాలపై సమర్థవంతంగా పోరాడటం తమ ప్రధాన లక్ష్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.