Group 3 Exams: ఆమె 9 నెలల గర్భిణీ మహిళ. ఈనెల 21వతేది కాన్పుకు అవకాశాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతలోనే పరీక్షలు వచ్చాయి. తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు పెద్ద సాహసమే చేసింది ఆ మహిళ. నిండు గర్భిణీగా ఉన్న ఆ మహిళ గ్రూప్ – 3 పరీక్షలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ -3 పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. అయితే పరీక్షల సమయానికి ఓ మహిళ కంగారు కంగారుగా.. కేంద్రంలోకి వచ్చింది. ఆ మహిళ గర్భిణీ స్త్రీ కావడంతో, ఎవరమ్మా మీరు.. ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయంటూ.. అక్కడి సిబ్బంది తెలిపారు. దీనికి సమాధానంగా సదరు మహిళ.. తాను కూడా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు తెలపడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
హైదరాబాదులోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ సతీమణి రీనా. ప్రస్తుతం ఈమె కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 9 నెలల గర్భిణీ అయిన రీనా, గ్రూప్ – 3 పరీక్షలకు గతంలో దరఖాస్తు చేసింది. అయితే ఆదివారం గ్రూప్ – 3 పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో, నిండు గర్భిణీ రీనా పరీక్ష రాసేందుకు కోరుట్లలోని అరుణోదయ డిగ్రీ కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా రీనా తన లక్ష్యసాధన కోసం ధైర్యంగా పరీక్షకు హాజరు కావడంపై అక్కడి అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు పరీక్షా కేంద్రం సిబ్బంది లిఫ్ట్ సహాయంతో, తన పరీక్ష గది రెండవ అంతస్థుకు ఆమెను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు.
Also Read: BRS Venkateshwarlu: బీఆర్ఎస్ కు షాకిచ్చిన మాజీ ఎమ్మేల్యే.. కొనసాగడం కష్టమంటూ ప్రకటన
పరీక్ష రాసిన అనంతరం రీనా మాట్లాడుతూ.. తాను మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు హాజరైనట్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది తనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈనెల 21వ తేదీన కాన్పుకు అవకాశాలు ఉన్నట్లు తేదీని డాక్టర్లు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఏది ఏమైనా తన లక్ష్యసాధన కోసం నిండు గర్భిణీ మహిళ అయినప్పటికీ, పరీక్ష రాసేందుకు వచ్చిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు తోటి అభ్యర్థులు. పరీక్షా ఫలితాలలో కూడా ఉన్నత మార్కులు సాధించాలని కోరుకుందాం.
గ్రూప్-3 పరీక్షకు హాజరైన తొమ్మిది నెలల గర్భిణి
కోరుట్లలోని అరుణోదయ డిగ్రీ కాలేజీలో పరీక్షకు హాజరైన రీనా
ప్రస్తుతం కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రీనా
భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో గ్రూప్-3 పరీక్షకు హాజరు
ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది పూర్తి… pic.twitter.com/H9NAA0GFVf
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2024