Jagtial News: మనం ఎక్కడికైనా శుభకార్యానికి వెళుతున్నా, మీటింగ్ కి వెళుతున్నా టిప్ టాప్ గా రెడీ అవుతాం. అది కూడా దువ్విన తలనే దువ్వి, ఒకటికి రెండు సార్లు మన అందాన్ని అద్దంలో చూసుకొని మురిసిపోతాం. అది కూడా మెరుపుల చొక్కా ధరించాల్సిందే. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చొక్కా ధరించాలంటే యమ చిరాకు ఆయనకు. అంతేకాదు చొక్కా ధరించేందుకు నిరాకరించి, భార్యకు కూడా దూరమయ్యాడు. 50 ఏళ్లుగా ఒంటిపై చొక్కా ధరించని ఆ ధీరుడు కథే ఇది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య అంటే సమీప గ్రామాలలో కూడా తెలియని వారు ఉండరు. వార్డు మెంబర్ కూడా పనిచేసిన ఈయన తనదైన శైలిలో వస్త్రధారణ పాటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. వస్త్రధారణ అంటే రంగురంగుల చొక్కాలు ధరించి, టిప్ టాప్ గా రెడీ అవుతారని అనుకుంటే పొరపాటే. ఈయన చొక్కా అస్సలు ధరించడు. చొక్కా విషయంలో ఈయన రూటే సపరేట్. 50 ఏళ్లుగా చొక్కా ధరించకుండా బక్కయ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
అసలు కారణం ఇదే..
అక్కయ్య చొక్కా ధరించక పోవడానికి గల కారణం తెలుసుకుంటే ఔరా అనాల్సిందే. బాల్యంలో బక్కయ్య తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బక్కయ్యకు చొక్కా కూడా ధరింప చేయలేదట. బీద స్థితిలో ఉన్న ఆయన తల్లిదండ్రులు, బక్కయ్యకు ఊహ వచ్చిన సమయానికి కూడా చొక్కా ధారణ అలవాటు చేయలేదని బక్కయ్య తెలుపుతున్నారు. అదే అలవాటు ఇప్పటివరకు సాగుతుందట.
ఏదైనా శుభకార్యానికి వెళ్లిన బక్కయ్య చొక్కా ధారణ లేకుండానే అలాగే వెళ్తారు. అంతేకాదు తన పెళ్లి చూపులు సమయంలో కూడా బక్కయ్య అదే రీతిలో వెళ్లారట. వివాహం కాగానే మార్పు వస్తుందని బక్కయ్య కుటుంబ సభ్యులు భావించారు. పలుమార్లు భార్య చొక్కా ధరించాలని వేడుకున్నా, తన నిర్ణయంలో ఏమాత్రం మార్పు ఉండదని బక్కయ్య తెగేసి చెప్పారట. దీనితో చొక్కా ధారణ కారణంగా బక్కయ్య భార్య వదిలి వెళ్ళిపోయిందని గ్రామస్తులు తెలిపారు.
Also Read: Allu Arjun: తప్పు ఒప్పుకున్న అల్లు అర్జున్.. విచారణలో వెక్కి వెక్కి ఏడుస్తూ..?
తీవ్రమైన చలిగాలులు ఉన్నా, భారీ వడగాల్పులు ఉన్నా చొక్కా మాత్రం ధరించరు . తనకు చొక్కా ధారణ పాటిస్తే శరీరంపై చెమటలు వస్తాయని, అందుకే 50 ఏళ్లుగా చొక్కా ధరించడం లేదంటే బక్కయ్య తెలిపారు. ఏదిఏమైనా బాల్యంలో ఆర్థిక పరిస్థితుల వల్ల చొక్కా ధారణ లేకుండా ఉన్న బక్కయ్య, నేటికీ అదే పరంపర కొనసాగించడం విశేషం.