Nagar Kurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరు జనార్ధనులు ఒకే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. వారిలో నాగం జనార్ధనరెడ్డి అటు తిరిగి, ఇటు తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరడంతో ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మర్రి జనార్ధనరెడ్డి గెలుపు కోసం నాగం ప్రచారం కూడా చేశారు. తీరా ఎన్నికల ఫలితాలలో ఊహించని రిజల్ట్ ప్రజలు చూపించారు. దీంతో ఏడాది కాలం పాటు గప్ చుప్ గా ఉన్న జనార్ధనులు.. ఇప్పుడు లోకల్ బాడీ పదవి కోసం తహతహలాడుతున్నారట.. ఆ పదవే ఇద్దరి మధ్య చిచ్చు రేపుతోందంట.. దీంతో ఇద్దరి మధ్య అంతర్గత కుమ్ములాట మొదలైందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.. అసలు ఆ ఇద్దరి మధ్య అంత ప్రతిష్టాత్మకంగా మారిన ఆ స్థానిక పదవేంటి?
నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లో జానార్ధనరెడ్డిల రాజకీయం
నాగర్ కర్నూల్ నియోజకవర్గం పేరు చెప్తే చాలు జనార్దన్ రెడ్డి పేరు గుర్తుకొస్తుంది రాష్ట్రవ్యాప్తంగా.. రాజకీయంగా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బడా వ్యాపారి మర్రి జనార్దన్ రెడ్డి అంటే తెలంగాణ పాలిటిక్స్‌లో తెలియని వారు ఉండరు. ఇద్దరు జనార్ధనులు టిడిపి పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించిన నాగం జనార్ధనరెడ్డి టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి పవర్ ఉన్న నేతగా ఫోకస్ అయ్యారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం టిడిపితో విభేదించి నగరాసమితి పార్టీని స్థాపించి తన సత్తా చాటుకున్నారు. తెలంగాణ సాధన తర్వాత బిజెపిలోకి వెళ్లి ఉమ్మడి పాలమూరు ఎంపీ స్థానం నుండి పొటీ చేయడంతో పాటు, తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డికి నాగర్ కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు.. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు
ఆ తర్వాత బీజేపీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో … ఆయన రాజకీయ ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మర్రి జనార్దన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే మర్రి జనార్దన్ రెడ్డి వద్ద తగిన ప్రాధాన్యత లభించలేదని, తనకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ కూచుకుల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గుచూపడంతో ఆగ్రహించిన నాగం జనార్దన్ రెడ్డి కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని ఓడించాలన్న ఉద్దేశంతో పదేళ్లపాటు రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటున్న మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించేందుకు బిఆర్ఎస్‌లో చేరారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు జనార్ధునులు కలిసి పనిచేసినా, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇద్దరికీ కలిపి గత ఎన్నికల్లో షాక్ ఇచ్చారు.
సెగ్మెంట్లో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాగం, మర్రి
అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి క్యాడర్ నువ్వా నేనా అన్న విధంగా అడుగులు వేస్తూ వచ్చారు. శుభకార్యాలు, ఓదార్పుల సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి వేరువేరుగా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఏర్పడిందంట.. దానికి కారణం నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ సీటే అంటున్నారు .. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ మారి, జనరల్‌కి కేటాయించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పదవి కోసం ఇద్దరు జనార్ధన్‌లు అలెర్ట్ అయ్యారంట..
జడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసిన ఇద్దరు జనార్ధునులు
ఆ చైర్మన్ సీటులో జనార్దన్ రెడ్డి తన తనయుడు నాగం శశిధర్ రెడ్డిని కూర్చోపెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు మర్రి జనార్ధన్ రెడ్డి ఎన్నికలలో జెడ్పిటిసి గా పోటీ చేసి జడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి బీఆర్ఎస్ నేతల తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇద్దరు జనార్ధునులు ఆ ధిశగా గులాబీ పెద్దల దగ్గర లాబీయింగులు చేసుకుంటున్నారంట. అదే వారిద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైందంట. 2029 ఎన్నికల్లో నాగర కర్నూల్ ఎమ్మెల్యే సీటుపై ఇద్దరు జనార్ధునులు కన్నేశారంట.. అయితే ఎవరికి టికెట్ ఎవరికి వస్తుందో అని ఇప్పటి నుంచే ఇద్దరి నేతల మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడిందంట.. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ జెడ్పీటీసీలను గెలిపించుకుని.. జడ్పీ చైర్మన్ పదవి చేజిక్కించుకుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారంట
ఎమ్మెల్యే టికెట్ పై కన్నేసి జడ్పీ సీటు కోసం పాట్లు
గత మూడు రోజుల క్రితం ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు. కానీ నాగం జనార్దన్ రెడ్డి , ఆయన అనుచరులు హరీష్ రావు వెంట ఎక్కడా కనిపించలేదు. హరీష్ రావు రాకముందే నాగం జనార్దన్ రెడ్డి ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించడంతో ఇద్దరు జనార్ధునుల మధ్య పొగడడం లేదని మరోసారి బహిర్గతం అయిందంటున్నారు. మరి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు జనార్ధునులలో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది సస్పెన్స్ గా మారింది.
Story By Venkatesh, Bigtv