Jangaon Municipality: జనగామ బ్యూరో, స్వేచ్ఛ: జనగామ మున్సిపాలిటీ పీఠం ఎట్టకేలకు హస్తగతం అయింది. నాటకీయ పరిణామాలు, ఘర్షణలు, గందరగోళాలు, వాద ప్రతివాదాలు, ఒకిరిపై ఒకరు దూషణల నడుమ పురపోరు ముగిసింది. చైర్‌పర్సన్‌గా 22వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన కడకండి బాలమణి లక్కిడ్రాలో గెలిచారు. వైస్ చైర్మన్‌గా 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన భూష పర్వతాలు లక్కీ డ్రాలోనే ఎంపికయ్యారు. మున్సిపాలిటీలో మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను జనగామ ఆర్డీఓ, ఎన్నికల అధికారి గోపీరామ్ నిర్వహించారు. ఈనెల 16న జరుగాల్సిన ఎన్నికల ప్రక్రియ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈరోజు ఆ ప్రక్రియను నిర్వహించారు. జనగామ ఎన్నిక ప్రక్రియ సాగిందిలా..
మున్సిపాలిటీ కార్యాలయానికి బీ ఆర్ ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి 11.30గంటలకు చేరుకున్నారు. 12.25గంటలకు కాంగ్రెస్ సభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వచ్చారు. కాంగ్రెస్ పక్షం 16, బీ ఆర్ ఎస్ పక్షం 16 మంది ఎన్నికల హాల్‌కు చేరుకోగానే ఎన్నికల సిబ్బంది అందరి చేత సంతకాలు తీసుకున్నారు. 12.30గంటలకు చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ నుంచి చైర్మన్‌గా బరిలో ఉన్న కడకండి బాలమణికి చేతులెత్తాలని ఆర్డీఓ కోరారు. ఎక్స్ ఆఫీషియో ఓటుతో కలుపుకుని 16ఓట్లు బాలమణికి వచ్చాయి. బీ ఆర్ ఎస్ నుంచి పోటీలో ఉన్న సుగుణాకర్‌కు మద్దతు తెలిపేవారు చేతులెత్తాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో కలుపుకుని 16 మంది చేతులెత్తారు. ఇండింపెంటెంట్ సందుపట్ల మంజుల చేయి ఎత్తగానే కాంగ్రెస్ సభ్యులు ఆమే చేయిని కిందికి దించారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, బీ ఆర్ ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇరువురికి సమానంగా ఓట్లు రావడంతో అనివార్యంగా డ్రా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: iBomma Ravi Bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. కోర్టు విధించిన ఆ షరతు వింటే షాక్ అవ్వాల్సిందే!
చైర్మన్ ఎన్నికకు ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపీరామ్ డ్రా తీస్తామని కౌన్సిలర్లకు చెప్పారు. దీనికి రెండు పక్షాలకు చెందిన వారు సరే అన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిలు ఇద్దరు ఆర్డీఓ టేబుల్ వద్దకు చేరుకున్నారు. ఒక్కో అభ్యర్థి పేరును ఐదు చీటీల మీద రాసారు. ఇద్దరికి 10 చీటీలను ఓ డబ్బాలో వేసారు. అది చిన్నగా ఉందని, అందులో చీటీలు తీరగడం లేదని, వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అభ్యంతరం చెప్పారు. దీంతో మరో పెద్ద డబ్బాను తెప్పించారు. అందులో 10 చీటీలు వేసి బాగా కలెగలిపి చీటీని ఆర్డీఓ తీసారు. అందులో కడకంచి బాలమణి పేరు వచ్చింది. దీంతో జనగామ పుర పీఠం హస్తగతం అయింది.
బాలమణి పేరు డ్రాలో రాగానే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరేషాన్ అయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే బాలమణికి చైర్ పర్సన్‌గా ఎన్నిక అయినట్లుగా దృవీకరణ పత్రం ఇచ్చి, ఆమే చేత ప్రమాణస్వీకారం చేయించారు. బాలమణి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఎమ్మెల్యే తన కౌన్సిలర్లతో కలిసి ఆందోళన చేస్తూ నినాదాలు చేశారు. పోలీసుల జులం నశించాలి అంటూ ఎన్నికల ప్రక్రియ ను ఆపాలంటూ నినాదాలు చేశారు. వైస్ చైర్మన్ ఎంపికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆర్డీఓ గోపీరామ్ పోలీసుల సాయంతో వైస్‌చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. బీ ఆర్ ఎస్ కౌన్సిలర్లు 23వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన ఇండిపెండెంట్ భూష పర్వతాలు పేరును ప్రతిపాదించారు. కాంగ్రెస్ నుంచి 15వ వార్డు కౌన్సిలర్‌గా ఇండిపెండెంట్‌గా గెలిచిన మారబోయిన పాండును ప్రతిపాదించారు. ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో వీరికి డ్రా తీసారు. ఇందులో భూష పర్వతాలు విజేతగా నిలిచారు. పర్వతాలు చేత వెంటనే ప్రమాణస్వీకారం చేయించి, దృవీకరణ పత్రం అందించారు.
చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ సందుపట్ల మంజుల బీ ఆర్ ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా చేయి ఎత్తారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మంజుల చేయిని కిందికి దించారు. బీ ఆర్ ఎస్‌కు ఎత్తకుండా కిందికి దింపడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా కౌన్సిలర్ చేతిని కిందికి లాగడం ఏంటని ప్రశ్నించారు. కిందికి లాగిన కౌన్సిలర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పల్లాతో పాటు బీ ఆర్ ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. దీంతో కౌన్సిల్ హాల్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏసీపీ పండరీ చేతన్, సీఐ సత్యనారాయణలు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్నవారిని సముదాయించారు. ఓ దశలో పోలీసులను తోసుకుంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆందోళన చేయడం విశేషం. చివరికి ఆందోళనల నడుమే ఎన్నికల ప్రక్రియను ముగించారు ఆర్డీఓ గోపీరామ్.
మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికకు జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరు పార్టీ నడుమ ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా మున్సిపాలిటీ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. మున్సిపాలిటీలోకి ఎవ్వరిని పోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హాల్‌లో ఎన్నిక సందర్భంగా ఏసీపీ, సీఐలను డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ఎలాంటి గోడవ కాకుండా ఉంచారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎన్నికలు సజావుగా సాగేలా చూసారు.
మున్సిపల్ చైర్ పర్సన్ గా కడకంచి బాలమణి ఎన్నిక అయిన అనంతరం మున్సిపాలిటి బయట విలేకరులతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భగవంతుడు ఇరు పార్టీలకు సమానమైన ఓట్లు ఇచ్చాడని అన్నారు. చైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసాడని ఆరోపించారు. చేర్యాల మున్సిపాలిటీలో గెలిచిన విధంగా జనగామలో చేద్దామనుకున్నాడు. కానీ భగవంతుడు లక్కీ డ్రాలో కాంగ్రెస్‌కు పదవి ఇచ్చాడని వివరించారు. నేను న్యాయబద్దంగా పోదామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెప్పాను. కానీ ఆయన వినలేదని, ఇక ముందు పల్లా దౌర్జన్యాలు ఇక్కడ సాగనివ్వమన్నారు. జనగామలో గుండాగిరి చేద్దామని అనుకుంటున్నాడని, ఎమ్మెల్యే గుండాగిరిని సాగనివ్వమన్నారు. జనగామను అభివృద్ధి చేస్తామని వివరించారు.
ముందు నుంచి చైర్ పర్సన్‌గా చేద్దామని కాంగ్రెస్ పెద్దలు అనుకున్నారని నూతన చైర్ పర్సన్ బాలమణి అన్నారు. ఎన్నికల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకత్వం విశేషంగా పనిచేసిందన్నారు. అనుకోకుండా అటు బీ ఆర్ ఎస్‌కు, ఇటు కాంగ్రెస్‌కు సమానమైన ఓట్లు వచ్చాయన్నారు. చివరికి లాటరీ వేస్తే దేవుడి కృపతో ఆ పదవి నాకే వచ్చిందన్నారు. కాంగ్రెస్ పెద్దల సలహాలు, సూచనలతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానన్నారు.
Also Read: Mahabubabad Crime: దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు, మహబూబాబాద్‌లో ఘటన