Joint collector caught: ఆయనో సీనియర్ అధికారి. ఏ విషయంలోనూ కొదవలేదు. పైగా జిల్లాకు జాయింట్ కలెక్టర్ కూడా. అయినా చేతివాటం తగ్గలేదు. బాధితుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకోవాలని భావించారు. చివరకు అడ్డంగా ఏసీబీకి చిక్కారు. సంచలనం రేపిన ఈ యవ్వారం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరొకరి ని అదుపులోనికి తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి నివాసంతోపాటు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్ ఇంటిపై సోదాలు జరుగుతున్నాయి. భూపాల్‌రెడ్డి ఇంట్లో దాదాపు 16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాడు. పెద్దఎత్తున ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది? ఇంకా డీటేల్స్‌లోకి వెళ్తే.. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు ఓ వ్యక్తి నుంచి 8 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ , సీనియర్ అసిస్టెంట్. భూమి మార్పులు చేయాలంటే దాదాపు 8 లక్షలు ఖర్చు అవుతుందని బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డికి చెప్పాడు.
ALSO READ: సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
భూమి మార్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహరమని, తక్కువ మొత్తంలో చేయలేమని ఆఫీసు అధికారులు బాధితుడికి చెప్పారు. ఈ వ్యవహారం చాన్నాళ్లు సాగింది. చివరకు బాధితుడు అంత మొత్తం ఇవ్వడానికి అంగీకరించాడు. ఈలోగా ఈ వ్యవహారాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లాడు.
డబ్బును ముత్యంరెడ్డి నుంచి సీనియర్ అసిస్టెంట్ ద్వారా జాయింట్ కలెక్టర్ తీసుకున్నారు. ఈ సమయం కోసం వేచి చూసిన ఏసీబీ అధికారులు, స్పాట్‌లో జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌లను పట్టు కున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు మదన్ మోహన్‌రెడ్డి.
మరోవైపు జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు ముమ్మరం చేసింది. జాయింట్ కలెక్టర్ ఇంట్లో 16 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరి ఏసీబీ దాడుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.