హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల ధనదాహం నేడు వేలాదిమంది విద్యార్థుల కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. ఎంసెట్‌లో మంచి రాకపోవటమో లేక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లోనే చేరాలనే ఆశతో అప్పోసప్పో చేసి తమ పిల్లలకు మేనేజ్‌మెంట్ కోటాలో సీటు కొని, రేపో మాపో క్లాసులకు పంపటానికి రెడీ అవుతున్న వేలాది మంది తల్లిదండ్రులకు ఆగస్టు 9న హైకోర్టు తీర్పు ఊహించని షాకిచ్చింది. సీట్ల పెంపు, తగ్గింపు అనేది కాలేజీ యాజమాన్యాలు నిర్ణయించాల్సిన విషయం కాదని, అది ప్రభుత్వం పరిధిలోని అంశమని కోర్టు అభిప్రాయపడటంతో…లేని సీట్లనూ ముందే మేనేజ్‌మెంట్ కోటాలో దర్జాగా సీట్లు అమ్ముకుని అందినకాడికి వసూళ్లు చేసుకున్న కాలేజీల యాజమాన్యాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో.. 35 వేల వరకు మేనేజ్‌మెంట్ సీట్లున్నాయి. అయితే.. సివిల్, మెకానికల్ బ్రాంచిలకు పెద్దగా డిమాండ్ లేకపోవటంతో కాలేజీ యాజమాన్యాలు కొత్త ప్లాన్ వేశాయి. డిమాండ్ లేని సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో అదే సంఖ్యలో బాగా డిమాండ్ ఉండే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి సీట్లను పెంచుకున్నాయి. వెంటనే అమలు చేసేందుకు.. జేఎన్‌టీయూ, ఢిల్లీలోని ఏఐసీటీఈ ఆమోదం, అనుబంధ గుర్తింపు ఉన్నట్లు తీసుకున్నాయి. అయితే, కొత్త కోర్సుల్లో సీట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న ఏఐసీటీఈ చట్టంలోని నిబంధన ప్రకారం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలన్నీ కలిసి ప్రభుత్వానికి దరఖాస్తు చేశాయి. అయితే, ప్రభుత్వం కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, రద్దు కుదరదని ఉన్నత విద్యాశాఖ తేల్చి చెప్పింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఎలాంటి కారణాలు పేర్కొనకుండా ఉన్నత విద్యాశాఖ తమ దరఖాస్తును తిరస్కరించిందని యాజమాన్యాలు కోర్టుకు నివేదించారు. కాగా, కోర్సుల్లో సీట్ల పెంపు, తగ్గింపు, విలీనం అంశాలను ప్రభుత్వం విస్తృతకోణంలో చూస్తుందని, అందుకు కాలేజీల మౌలిక వసతులు, బోధన సిబ్బంది, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రమాణాలున్న కొన్ని కాలేజీలకు 120 సీట్ల వరకు పెంచుకోవడానికి అనుమతించామని, అలాగే అన్ని కాలేజీలకూ వెసులుబాటు ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
దీంతో అప్పటికే తమ ఇష్టం వచ్చినట్లుగా సీట్లు పెంచుకుని, వాటిలో మేనేజ్‌మెంట్ కోటా కింద ఉన్నవన్నీ అమ్ముకొని నిశ్చింతగా ఉన్న మేనేజ్‌మెంట్లకు ఇప్పుడేం చేయాలో పాలుపోవటం లేదు. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని భావించిన ప్రైవేటు కాలేజీలు ఎంసెట్ రిజల్ట్ వచ్చిన మర్నాటి నుంచే, కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్వోలు.. ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకుని, 40 వేల ర్యాంకు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులకు ఫోన్‌లు చేసి సీట్లు ఆఫర్ చేశాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను బట్టి సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్రుతను బట్టి కంప్యూటర్ సైన్స్ సీటు రూ. 5 నుంచి 18 లక్షల వరకు, ఐటీ వంటివి కాస్త తక్కువకు అమ్ముకున్నాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ జరగాల్సి ఉన్నా.. ఇంటర్ పరీక్ష నాటికే కొన్ని కాలేజీలు సీట్లు అమ్ముకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 170 ప్రైవేటు కాలేజీలు ఉండగా.. వాటిలో లక్షకు పైగా సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది 2.48 లక్షలమంది ఇంజనీరింగ్ కోసంఎంసెట్ రాయగా, వారిలో 1.80 లక్షల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. వీరిలో లక్షకు పైగా స్టూడెంట్లు కేవలం కంప్యూటర్ సైన్స్ సీట్లను కోరుకుంటున్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్ మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. 2005 వరకు మేనేజ్‌మెంట్ కోటా కేవలం 5 శాతమే. కానీ, తర్వాతి రోజుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి దానిని 30 శాతానికి పెంచుకున్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి, ఫీజుల నియంత్రణ కమిటీ(ఎఫ్‌ఆర్సీ) పర్యవేక్షణ ఉండి తీరాలని, ఈ సీట్లకు ఎవరు దరఖాస్తు చేశారు? ఎంత ఫీజు వసూలు చేశారనే వివరాలు బహిర్గతం కావాలని, లేకుంటే బ్లాక్ మనీ దందాకు కాలేజీలు పాల్పడతాయని విద్యార్థి సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా.. అది ఆచరణలోకి రాలేదు.
కోర్టు తీర్పు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల మీద ఒత్తిడిని పెంచుతున్నారు. అయితే.. ‘కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాం..ఇప్పుడు మేం ఏమీ చేయలేం’ అంటూ చేతులెత్తేస్తున్నారు. మరోవైపు.. కోర్టుకెళ్లిన వారిలో పెద్ద కాలేజీలే ఉండటంతో మేనేజ్‌మెంట్ సీట్లకు బాగా రేటు పలికిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాలేజీల్లో సీట్లు కొనుగోలు చేసిన వారిలో ఎంసెట్‌లో తక్కువ స్కోరు వచ్చిన వారు, అసలు ఎంసెట్ క్వాలిఫై కానివారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వీరికి చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చే అవకాశం లేకపోవటంతో తమ పిల్లలకు ఒక ఏడాది వృధా అవుతుందనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. అలాగే, చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవటం, ఇప్పుడు గట్టిగా నిలదీస్తే.. అదీ రాదేమోననే పరిస్థితి. దీంతో రోజూ కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.
హైకోర్టులో చుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లేందుకు ఆలోచిస్తున్నాయి. అయితే.. త్వరగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికావటం, నేడు మూడో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జరనుండటంతో ఈ విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కాలేజీల ప్లాన్ కుదరనట్లేనని, ఒకవేళ.. ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లినా, కేసు తేలేలోగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా మొదలవుతాయని సర్కారు భావిస్తోంది.