Jubilee Hills bypoll counting: తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠకు గురి చేస్తోన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ రేపు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన రేపు (శుక్రవారం రోజున) పలు ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ కీలక ఘట్టం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినన ప్రభుత్వ భవనాలు, వాటిలో పని చేసే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సెలవు కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సెలవును చెల్లింపుతో కూడిన సెలవు (Paid Holiday) గా పరిగణించనున్నట్లు తెలిపారు. అంటే, ఈ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు సెలవును అనుభవించినప్పటికీ.. ఆ రోజుకు సంబంధించిన జీతాన్ని కోల్పోరు. ఉద్యోగుల ఎన్నికల విధులను, ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రశాంతంగా ముగియగా.. ఇప్పుడు అందరి దృష్టి రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో గెలుపును అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లెక్కింపు ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉండడంతో.. మధ్యాహ్నం లోపు ఉపఎన్నిక తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.