⦿ బ్యారేజీల నోట్ ఫైల్స్‌పై స్పష్టత లేదు
⦿ కాళేశ్వరం కమిషన్‌తో స్మితా సబర్వాల్
⦿ సీఎంఓకు వచ్చే ఫైళ్లకు కేసీఆర్ ఆమోదం
⦿ దాపరికం లేకుండా నిజాలు చెప్పాలన్న ఘోష్
⦿ మేడిగడ్డ ప్రారంభోత్సవం గుర్తుకు లేదన్న సోమేశ్
⦿ ఆ సమయంలో నీటిపారుదల కార్యదర్శి బాధ్యతలు
⦿ సమాధానం చెప్పకపోవడంతో కమిషన్ ఆగ్రహం
స్వేచ్ఛ తెలంగాణ బ్యూరో: Kaleswaram Commission: అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరేదీ చెప్పను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ముందు గురువారం జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలియదు. గుర్తుకు లేదు. స్పష్టత లేదు. నా దృష్టిలో లేదు. అవగాహన లేదు అంటూ సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం నిర్మించాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ వివరాలు చెప్పకుండా తప్పించుకునేందుకు చూశారు.
మేడిగడ్డి, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం జరగకుండానే అప్పటి సీఎంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు బ్యారేజీలకు పరిపాలనా అనుమతుల జారీకి కేబినెట్ ఆమోదం లేదనే అంశం తనకు తెలియదని, ఆ సమయంలో తాను ముఖ్యమంత్రికి సెక్రెటరీగా ఉన్నానని వివరించారు. కేబినెట్ అనుమతి లేకుండానే ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వస్తాయా అని ఘోష్ ప్రశ్నించగా, తనకు అవగాహన లేదని బదులిచ్చారు. కేబినెట్ ఆమోదం పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయా అంటూ ప్రశ్నించగా తెలియదు అంటూ రిప్లై ఇవ్వడంతో ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. దాపరికం లేకుండా నిజాలు చెప్పాలంటూ స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే ప్రతీ ఫైల్‌కు సీఎం అప్రూవల్ ఉంటుందన్నారు.
కేబినెట్ సమావేశాలకు హాజరై.. ఏం తెలియదంటే ఎలా?
ఏం అడిగినా తెలియదంటూ సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తుండడంతో జస్టిస్ ఘోష్ జోక్యం చేసుకుని, ఎప్పటి నుంచి సీఎంఓలో సెక్రెటరీగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎంగా కేసీఆర్ కొనసాగినంతకాలం దాదాపు పదేండ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లు స్మితా సబర్వాల్ బదులిచ్చారు. కేబినెట్ సమావేశాలకు హాజరవుతూ కూడా కాళేశ్వరం విషయాలపై స్పష్టత లేకపోవడాన్ని ప్రశ్నించగా, సీఎంఓలో తాను ఏడు శాఖలను చూశానని, తన పరిధి పరిమితంగానే ఉండేదని, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఇతర రాష్ట్రాలతో పాటు జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు.
మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ శాఖతో పాటు ఇతర డిపార్టుమెంట్ల నుంచి నోట్ ఫైల్స్ సీఎంఓకు వచ్చిన విషయం తన దృష్టిలో లేదని, ప్రస్తుతం ఆ అంశాలు గుర్తుకురావడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు వాటి అంచనా వ్యయంపై జీవోలు జారీ చేయడం సీఎంఓకు తెలియకుండానే జరిగాయా? అని సూటిగా ప్రశ్నించగా, వాటిపై తనకు అవగాహన లేదని స్మిత రిప్లై ఇచ్చారు.
కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు
కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే అంశాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ విధిగా సీఎంఓకు రావాల్సిందేనని, సీఎం ఆమోదం కోసం వేర్వేరు శాఖలు పంపేవి కూడా రావాల్సిందేనని స్మిత వివరించడంతో కేబినెట్ భేటీకి పంపించకుండా నేరుగా సీఎం హోదాలో కేసీఆర్ ఫైళ్ళకు ఆమోదం తెలిపారా అని జస్టిస్ ఘోష్ నిలదీశారు. ఆ సంగతి తనకు తెలియదని, కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితి ఉంటే కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్ణయాలు జరుగుతాయని ఆమె బదులిచ్చారు.
ఏం గుర్తు లేదంటూ సోమేశ్ రిప్లై
మూడు బ్యారేజీలను మేడిగడ్డ వేదికగా 2019లో ప్రారంభోత్సవం జరిగే సమయానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా (పూర్తి అదనపు బాధ్యతలతో) ఉన్నప్పటికీ ఆ తేదీ, ఘట్టం గుర్తుకు లేదని రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మూడు బ్యారేజీలకు సంబంధించి తాను ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే సమయానికే ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగిపోయాయని కమిషన్‌కు వివరించారు. తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేదా మూడు బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి డీసెంట్ (భిన్నాభిప్రాయం) రిమార్కులు రాయలేదని స్పష్టం చేశారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకే ఉత్తర్వులు జారీ చేశానని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. బ్యారేజీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా మంత్రివర్గ సమావేశానికి నోట్ ఫైళ్ళు వచ్చాయా అని ప్రశ్నించగా, సూటిగా బదులివ్వలేదు. జస్టిస్ ఘోష్ జోక్యం చేసుకుని, అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని, సూటిగా ఇవ్వాలని, సాధారణ ప్రక్రియ తరహాలో వివరణ ఇవ్వొద్దంటూ మందలించారు. కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు తప్ప డిబేట్ చేయడానికి రాలేదని ఆయనకు గుర్తుచేశారు. సీఎస్‌గా ఉన్న సమయంలో మూడు బ్యారేజీలకు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి ఏవైనా ప్రతిపాదనలు, విజ్ఞప్తులు, కీలక నిర్ణయాల కోసం నోట్ ఫైల్స్ వచ్చాయా అంటూ ఘోష్ ప్రశ్నించగా చాలా కాలమైంది, గుర్తుకు రావడంలేదు అంటూ బదులిచ్చారు.
Also Read: Telangana Weather: ఆ జిల్లాల్లో తస్మాత్ జాగ్రత్త.. బయటకు వస్తే గజగజే..
ఆలస్యంగా రావడంపై ఆగ్రహం
క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఓపెన్ కోర్టు హాల్‌లో ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని జస్టిస్ చంద్ర ఘోష్ సిద్ధంగా ఉండగా హాజరు కావాల్సిన సోమేశ్ కుమార్ ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి కమిషన్ కార్యాలయానికి చేరుకున్నా హాల్‌లోకి రావడంలో జరిగిన ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ విచారణ ముగిసిన వెంటనే సోమేశ్ కుమార్ ఎంక్వయిరీ మొదలు కావాల్సి ఉన్నా వారిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నట్లు సిబ్బంది ద్వారా తెలిసింది. సోమేశ్ కుమార్ ఆలస్యంతో కొద్దిసేపు విచారణను వాయిదా వేసిన జస్టిస్ ఘోష్ హాల్‌లోనే సోమేశ్ కుమార్‌ను కూర్చోబెట్టారు