Indian Railways: భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ తప్పకుండా ఉండాలి. ఒకవేళ టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అయితే, ఓ ట్రైన్ లో మాత్రం టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ రైలు ప్రారంభం నుంచి ఉచితంగానే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే సంస్థ.
ఇంతకీ ఈ స్పెషల్ రైలు ఎక్కడ ఉందంటే?
టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఏకైక రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ మధ్య నడుస్తున్నది. ఈ రైలు పేరు భాక్రా-నంగల్ రైలు. ఇందులో జర్నీ చేయాలంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రైల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చు. ఈ రైలు భాక్రా-నంగల్ ఆనకట్ట సమీపంలోని సుమారు 13 కిలో మీటర్ల మేర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. భాక్రా-నంగల్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు డ్యామ్ చూడ్డానికి వచ్చే పర్యాటకులు ఈ ట్రైన్ లో జర్నీ చేస్తారు.
ఎందుకు ఈ రైలు ఉచిత సేవలు అందిస్తుందంటే.
ఈ రైలు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోకి వెళ్లాలి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అధికార పగ్గాలు చేపట్టగానే పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు. ఇందులో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే నార్త్ ఇండియాలో భాక్రా-నంగల్, సౌత్ ఇండియాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించారు. 1948లో భాక్రా-నంగల్ ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు కార్మికులతో పాటు అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్యామ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్థానికులతో పాటు పర్యాటకుల కోసం ఉచితంగా ఈ రైలును నడపాలని నిర్ణయించారు.
Read Also: మహా కుంభమేళా స్పెషల్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో అయోధ్య, వారణాసి చూసే అవకాశం!
రోజూ 800 మంది ప్రయాణం
ఇక భాక్రా-నంగల్ రైలు సర్వీస్ మొదలైన తొలినాళ్లలో స్టీమ్ ఇంజిన్ ఉండేది. సుమారు 6 సంవత్సరాలత తర్వాత 1953లో ఆధునిక ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు రైలు ఇంజిన్లను మార్చుతూ వచ్చారు. ఇక ఈ ఫ్రీ రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి పొద్దున 7:05 గంటలకు బయల్దేరుతుంది. 8:20 వరకు భాక్రాకు చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3:05 గంటలకు నంగల్ నుంచి బయల్దేరి సాయంత్రం 4:20కి భాక్రా స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలను స్థానికులు, విద్యార్థులు, పర్యాటకులు వినియోగించుకుంటున్నారు. ఈ రైలు ప్రయాణం కొండలు, గుట్టల నడుమ ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. అటు ఈ రైలును వారసత్వం సంపదగా గుర్తించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తున్నది.
Read Also: ట్రైన్ జర్నీ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మరింత ఆహ్లాదకరంగా వెళ్లొచ్చు!