కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న స్థానిక రాజకీయం తాజా చేరికలతో అత్యంత ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడు పెంచడంతో అధికార పక్షం మరియు ప్రతిపక్షాల మధ్య బలాబలాల యుద్ధం మొదలైంది. తాజాగా 17, 39వ డివిజన్లకు చెందిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బండి సంజయ్ సమక్షంలో చేరికలు
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో ఈ ఇద్దరు కార్పొరేటర్లు కాషాయ కండువా కప్పుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. నగర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కార్పొరేటర్లు వెల్లడించారు. ఈ ఇద్దరి చేరికతో బీజేపీ బలం ప్రస్తుతం 32కి చేరుకోగా.. తమకు మొత్తం 34 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మ్యాజిక్ ఫిగర్ దిశగా..
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 60 కాగా, కో-ఆప్షన్ సభ్యులతో కలిపి మొత్తం ఓట్ల లెక్క మారుతుంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లకు ఓటు హక్కు ఉంది. అందులో ఎంపీ హోదాలో బండి సంజయ్, ఎమ్మెల్యేల హోదాలో గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణలు ఉన్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. బీజేపీ ప్రస్తుతం 33 ఓట్ల బలాన్ని ప్రదర్శిస్తుండటంతో, గద్దె నెక్కడానికి కేవలం మరో రెండు ఓట్ల దూరంలో నిలిచింది.
మైండ్ గేమ్, రివర్స్ ఆపరేషన్
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అనడానికి నిన్నటి పరిణామాలే నిదర్శనం. ఒకవైపు బీజేపీలోకి చేరికలు సాగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో పావులు కదుపుతోంది. నిన్ననే బీజేపీలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు మళ్ళీ కాంగ్రెస్ టచ్‌లోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో కార్పొరేటర్లను కాపాడుకోవడం ఇప్పుడు పార్టీలకు సవాలుగా మారింది. ఎప్పుడు ఎవరు ఏ వైపు ఉంటారో తెలియని ఉత్కంఠ నెలకొంది.
గంగుల కోటలో చీలిక..?
దశాబ్ద కాలంగా కరీంనగర్ కార్పొరేషన్‌పై పట్టు సాధించిన గంగుల కమలాకర్ వర్గానికి ఇది పెద్ద దెబ్బగానే భావించవచ్చు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పక్క పార్టీల వైపు చూస్తుండటంతో గులాబీ దళం ఆత్మరక్షణలో పడింది. అటు అధికార కాంగ్రెస్, ఇటు దూకుడు మీదున్న బీజేపీ మధ్య కరీంనగర్ మేయర్ పీఠం పోరాటం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. రాబోయే రోజుల్లో మరికొంత మంది కార్పొరేటర్లు జంప్ అయ్యే అవకాశం ఉండటంతో కరీంనగర్ కార్పొరేషన్‌లో ఏం జరగబోతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Ponguleti Srinivasa Reddy: పురపోరులో పొంగులేటి మ్యాజిక్.. 10 రోజుల ప్రచారంతో.. 70 శాతం సక్సెస్ రేట్