Karimnagar Robbery: కరీంనగర్ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టపగలే ప్రముఖ PMJ జ్యువెలరీ షాప్‌లో జరిగిన భారీ దోపిడీ ఘటన మరవకముందే.. సరిగ్గా రెండు నెలల వ్యవధిలోనే అదే తరహాలో మరో దారుణం వెలుగుచూసింది. ఈసారి దుండగులు ఒక నివాస గృహాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆయుధాలతో కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేసి కోట్ల విలువైన సొత్తుతో పరారయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భగత్ నగర్‌లో అసలేం జరిగింది?
నగరంలోని భగత్ నగర్ ప్రాంతంలో అజ్మత్ అలీ అనే వృద్ధుడు తన కుటుంబంతో కలిసి ఒక భవనం మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ లాగే మంగళవారం రాత్రి నిద్రపోయే ముందు గ్రౌండ్ ఫ్లోర్‌లోని లైట్లు ఆపేందుకు అజ్మత్ అలీ కిందకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ అప్పటికే కాపుకాసి ఉన్న ఆగంతుకులు ఒక్కసారిగా ఆయనపై పడి నోరు మూసివేశారు. అనంతరం ఇంట్లోకి తీసుకెళ్లి ఆయనతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలపై తీవ్రంగా దాడి చేశారు. తుపాకులు, కత్తులు చూపిస్తూ “అరిస్తే ప్రాణాలు తీస్తాం” అని బెదిరించి, అందరినీ ఒకే గదిలో కట్టేసి బంధించారు.
కన్నుమూసి తెరిచేలోపే సొత్తు గాల్లో కలిసిపోయింది!
బాధితులను నిర్బంధించిన అనంతరం దుండగులు ఇల్లంతా జల్లెడ పట్టారు. ఇంట్లో దాచి ఉంచిన 66 తులాల బంగారం, 10 తులాల వెండి, మరియు రూ. 21 లక్షల నగదును దోచుకున్నారు. ఎవరికీ సమాచారం అందించకుండా బాధితుల మొబైల్ ఫోన్లను కూడా తమతో పాటు పట్టుకెళ్లారు. చివరికి ఇంటి బయట పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలపై వేములవాడ బైపాస్ మీదుగా పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుల కదలికలు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
తెలిసిన వ్యక్తుల హస్తమేనా?
బాధితుల ఇంట్లో కేవలం వృద్ధులు, మహిళలే ఉంటారని తెలిసిన వ్యక్తులే పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు అజ్మత్ అలీ తన పెద్ద అల్లుడిపైనే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఉత్తరాది హిందీ భాషలో మాట్లాడుకున్నారని, తన అల్లుడు కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడే కావడంతో అతడి పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. భద్రతకు పేరొందిన కరీంనగర్‌లో వరుస దోపిడీలు జరగడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లతో మైండ్ బ్లాంక్!