Medchal Girl Death: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సైదోనిగడ్డ తండాకు చెందిన ధారావత్ శాంతి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు 11 ఏళ్ల కుమార్తె ధారావత్ యన్విత ఉంది.
అయితే శుక్రవారం ఉదయం శాంతి కూలీ పనుల కోసం మేడ్చల్‌కు వెళ్లింది. సాయంత్రం సుమారు 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి తలుపు తట్టగా కుమార్తె తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన అక్క సూచనతో ఇంటి వెనుక వైపు వెళ్లి చూడగా బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే శాంతి కేకలు వేయడంతో బావ, ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి బాలికను కిందకు దించారు.
Also read: ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణావకాశం.. Airtel కస్టమర్లకు మాత్రమే ఈ ఛాన్స్!
అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. కాగా బాలికతో ఆడుకునే పిల్లలను తల్లి ఆరా తీయగా.. ఉదయం బాలిక ఆలయానికి వెళ్లిందని, అక్కడ ఓ మైనర్ బాలుడిని కలిసిందని వారు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలిక తల్లి బాలుడు పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతికి గల అసలు కారణాలు ఏమిటి?, ఘటనకు ముందు ఆమె ఎవరిని కలిసింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also read: కోర్ట్ హీరో రోషన్ ‘తెల్ల కాగితం’ టీజర్ రిలీజ్!