Korra Meenu: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ మత్స్య రంగానికి మకుటాయమానంగా నిలిచే మరో అద్భుత ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వేదికగా సాకారం కాబోతోంది. మార్కెట్‌లో డిమాండ్, అంతకు మించి ధర పలికే ‘కొర్రమీను’ (ముర్రెల్/మరల్) చేపల ఉత్పత్తికి కరీంనగర్ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా రూ. 2.5 కోట్ల భారీ వ్యయంతో కరీంనగర్‌లో ప్రతిష్టాత్మక “సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్” ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మత్స్యకారుల ఆర్థిక బలోపేతమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న ఈ కేంద్రాన్ని వచ్చే నెలలోనే ప్రారంభించేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్య రంగానికి కరీంనగర్ జిల్లా త్వరలోనే సరికొత్త చిరునామాగా మారబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం చేపల ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఏటా చెరువులు, ప్రాజెక్టుల్లో సైతం ఉచితంగా కోట్ల విలువ చేసే చేపపిల్లలను పంపిణీ చేస్తుంది. అయితే మరింతగా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు ఇప్పుడు కొర్రమీను ఉత్పత్తికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభమైన తర్వాత కరీంనగర్ జిల్లా ‘కొర్రమీనుకు కేరాఫ్ అడ్రస్’గా మారే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు నాణ్యమైన కొర్రమీను పిల్లల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొర్రమీను కేంద్రం వల్ల ఆ సమస్య తొలగిపోతుంది. కొర్రమీను ఉత్పత్తి పెరిగితే మార్కెట్‌లో మంచి ధరలు లభించి తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మత్స్యకారులు ఆశిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కేవలం ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా ఉమ్మడి కరీంనగర్ మత్స్యకారులకు వరప్రదాయినిగా మారనుంది. ఈ కేంద్రం పరిధిలోకి ప్రధానంగా జగిత్యాల,పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ నాలుగు జిల్లాలను క్లస్టర్ కిందకు తీసుకొచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లోని జలాశయాలు, చెరువులు కొర్రమీను సాగుకు కేంద్ర బిందువులు కానున్నాయి. ఈ జిల్లాల్లో ఒండ్రుమట్టి లభ్యత ఉండటంతో ఈ నాలుగు జిల్లాలు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: 300 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. కేరళ ‘కావి’ ఫ్లోరింగ్‌తో.. ఇల్లు ఎప్పుడూ కూలే!
సాధారణంగా కొర్రమీను పిల్లల (సీడ్) లభ్యత తక్కువగా ఉండటం వల్ల మత్స్యకారులు ఇన్నాళ్లూ ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. ఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే అధునాతన హేచరీస్ (చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు), నాణ్యమైన సీడ్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఇక్కడి నుంచే క్లస్టర్ పరిధిలోని జిల్లాల మత్స్యకారులకు నాణ్యమైన కొర్రమీను పిల్లలను సరఫరా చేస్తారు.
కొర్రమీను సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ఉత్పత్తిని భారీగా పెంచడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఒక ట్రైనింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కొర్రమీనును తక్కువ సమయంలో ఎలా పెంచాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మత్స్యకారులకు ఇక్కడ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు ప్రారంభమయ్యాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఒక దఫా (మొదటి విడత) ఎంపిక చేసిన 50మంది మత్స్యకారులకు విజయవంతంగా శిక్షణ కూడా పూర్తి చేశారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, తక్కువ విస్తీర్ణంలో.. ఎక్కువ లాభాలు వచ్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు చేరవేయడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. కొర్రమీను పిల్లల పెంపకం, వాటికి అందించాల్సిన మేత, వ్యాధుల నివారణ, ఆధునిక చెరువుల నిర్వహణపై ఇక్కడ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇప్పిస్తున్నారు.ఈ శిక్షణ పొందిన మత్స్యకారులు క్లస్టర్ పరిధిలోని మిగతా వారికి గైడ్‌లుగా వ్యవహరించనున్నారు.
రాష్ట్రంలో ప్రజల డిమాండ్ కు సరిపడ కొరమీను చేపలు అందుబాటులో లేవు. ఏపీతో పాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అవి నాణ్యతలేకపోవడం, టెస్టు సైతం లేకపోవడం, దీనికి తోడు ట్రాన్స్ పోర్టు, ప్యాకింగ్, లోడింగ్, అన్ లోడింగ్, సరిహద్దు ట్యాక్సలతో పాటు కమీషన్లు ఎక్కువ అవుతుండటంతో ధరలు సైతం భారీగా ఉంటున్నాయి. ప్రస్తుతంమార్కెట్‌లో కిలో కొర్రమీను ధర రూ. 400 నుంచి రూ. 600 పైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొర్రమీను లభ్యత పెరగడమే కాకుండా, వేలాది మత్స్యకార కుటుంబాల ఆదాయం రెట్టింపు కానుంది. వచ్చే నెలలో ఈ కేంద్రం ప్రారంభమైతే.. తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది. వచ్చే నెలలో ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే.. కరీంనగర్ పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగడం ఖాయం.
Also Read: చెక్ పోస్టు ముందే అక్రమ మద్యం సిట్టింగులు.. పట్టించుకోని అధికారులు