బీసీలకు బ్రాండ్ అంబాసిడర్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విన్యాసాలు అందరికీ తెలిసినవే. బీఆర్ఎస్ 9 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు జ్యోతిబా పూలే పేరు కూడా ఎత్తని కవిత, అధికారం పోగానే, అసెంబ్లీ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలంటూ రాగం తీస్తున్నారు. బీసీ మంత్రం జపిస్తున్నారు. కవిత డబుల్ గేమ్ పై ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు బీజేపీ నేత రఘునందన్ రావు. అసలు కవిత ఎవరు, బీసీనా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
కవిత ఎవరు ? ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడరా ?బీఆర్ఎస్ హయాంలో బీసీలకు కేసీఆర్ చేసిన ద్రోహానికి చింతిస్తూ కవిత లెంపలు వేసుకోవాలి. ఆమె బోధించడం కంటే ముందు ఆచరించడం నేర్చుకోవాలి
– రఘునందన్ రావు ఫైర్ pic.twitter.com/8hvuCuDDiQ
— Telugu360 (@Telugu360) June 27, 2025
బీసీలకు ఏమిచ్చారు..?
బీసీలకు మద్దతుగా వస్తున్న కవిత కానీ, ఆమె పార్టీ కానీ అసలు బడుగు బలహీన వర్గాలకు ఏం చేసిందంటూ ప్రశ్నించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ లో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగిందని విమర్శించారు. కవితకు బీసీలపై అంత ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎందుకివ్వలేదన్నారు. బీసీ మంత్రుల్ని సైతం అవమానించి పార్టీనుంచి బయటకు పంపేశారని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి బీసీలకిచ్చారా, కనీసం సీఎల్పీ నేత పదవి అయినా బీసీలకిచ్చారా అంటూ లాజిక్ తీశారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు కేసీఆర్ చేసిన ద్రోహానికి చింతిస్తూ కవిత లెంపలు వేసుకోవాలన్నారు. గన్ పార్క్ నుంచి నడుచుకుంటూ వెళ్లి అమర వీరుల విగ్రహాల వద్ద నిలబడి క్షమాపణలు అడగాలన్నారు. పార్టీకి సంబంధించిన ఏ పదవి కూడా బీసీలకు ఇవ్వకుండా, వారిని ఎదగనీయకుండా చేశారని మండిపడ్డారు.
ఆచరించడం నేర్చుకో..
అంబేద్కర్ చెప్పినట్టు బోధించడం కంటే ముందు కవిత ఆచరించడం నేర్చుకోవాలన్నారు రఘునందన్ రావు. బీసీలకు అన్యాయం జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్న కవిత, అసలు బీఆర్ఎస్ తరపున బీసీలకోసం ఏం చేశారని నిలదీశారు. వాస్తవానికి బీసీలను అవమానించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. అధికారం పోగానే ఇప్పుడు కవితకు బీసీలు కావాల్సి వచ్చారని, ఇప్పుడు కూడా కేవలం రాజకీయాలకోసమే బీసీల పేరుని వాడుకోడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకోసం వస్తున్న కవితను వారంతా నిలదీయాలన్నారు.
బిర్యానీపై విమర్శలు..
బీసీల తరపున మాట్లాడుతూ తన ద్వంద్వ వైఖరి బయటపెట్టుకుంటున్న కవిత, ఇటీవల ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆంధ్రోళ్ల బిర్యానీ అనే వ్యాఖ్యలు చేశారు. కవిత కామెంట్లపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆమెకు ఆంధ్రోళ్ల బిర్యానీ ఏం నచ్చుతుందని, తీహార్ జైలులో చిప్పకూడు రుచిగా ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అటు తెలంగాణ వైపు నుంచి కూడా కవిత వ్యాఖ్యలపై ఎక్కడా స్పందన లేదు. అధికారం లేనప్పుడు ప్రాంతీయ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం బీఆర్ఎస్ నేతలకే చెల్లిందని అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. కవితకు చిత్తశుద్ధి ఉంటే, ముందు పార్టీ ప్రెసిడెంట్ పదవి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ బీసీలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. పార్టీలో లుకలుకలను కవర్ చేసేందుకు కవిత పదే పదే మీడియా ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నా, ఆమె వెంట బీఆర్ఎస్ కండువా కప్పుకున్న నాయకులెవరూ కనపడ్డంలేదు. జాగృతి పేరుతో జండాలు, కండువాలతో ఆమె రాజకీయం చేస్తున్నారు.