Kavitha Ultimatum: సెంట్రింగ్ కార్మికులతో సాయంత్రం లోపు చర్చలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు స్వయంగా తానూ ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఇందిరాపార్క్ సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి కవిత మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇన్ని అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానికి సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు.
తాళ్లు కట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ సెంట్రింగ్ కార్మికులు పనిచేస్తుంటారని కవిత గుర్తుచేశారు. సెంట్రింగ్ కార్మికులు లేకుంటే అద్దాల మేడాలు ఉండవని పేర్కొన్నారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన సెంట్రింగ్ కార్మికులకు.. బిల్డింగ్ లు నిర్మించే అగ్రిమెంట్ లో ఏమాత్రం విలువలేదని ఆమె పేర్కొన్నారు. వారి పేర్ల ప్రస్తావనే ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గుంపు మేస్త్రీ (సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ) వచ్చాక తెలంగాణలో అందరి పరిస్థితి ఆగమవుతోందని కవిత మండిపడ్డారు. అందుకే గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో అని పిలుపునిచ్చారు.
హైడ్రా వచ్చిన తర్వాత నోటీసులు లేకుండానే ఇళ్లు కూలగొడుతున్నారని కవిత మండిపడ్డారు. దీంతో సెంట్రింగ్ పనిచేస్తున్న వారు తమ మేటిరియల్స్ నష్టపోతున్నారని అన్నారు. దీనికి ఇంటి యాజమాని గానీ ప్రభుత్వం గానీ పరిహారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రంలోగా సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని కవిత డిమాండ్ చేశారు. వారేమి గొంతెమ్మ కోరికలు అడగడం లేదని.. సాధ్యమయ్యేవే డిమాండ్ చేస్తున్నారని కవిత అన్నారు.
ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్ కు రూ.51, కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు పది నుంచి 20 లక్షలు పెంచమని మాత్రమే సెంట్రింగ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. వాళ్లు అడిగే అన్ని డిమాండ్లు కూడా సహేతుకమైనవేనన్న కవిత.. వాటికి తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మేస్త్రీలు స్వ్కేర్ ఫీట్ కు 4 వందలు అడుగుతున్నారని.. అందులో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేస్త్రీ చేతిలో ఎట్టి పరిస్థితుల్లో సెంట్రింగ్ కార్మికుల జుట్టు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
Also Read: 4,000 ఇళ్ల సక్సెస్ ఫార్ములా.. టెర్రస్‌పై ఈ చిన్న ట్రిక్‌తో.. ఇల్లంతా చల్లచల్లగా!
తెలంగాణ రక్షణసేన అధికారంలో వచ్చిన తర్వాత సెంట్రింగ్ కార్మికుల అన్నిడిమాండ్లను తీరుస్తామని ఈ సందర్భంగా కవిత హామీ ఇచ్చారు. 1000 నుంచి 2000 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉందని కవిత అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సెంట్రింగ్ కార్మికులు అడుగులో తాను అడుగు అవుతానని భరోసా కల్పించారు. రెండు రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం చూపకపోతే.. తాను కూడా మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చుంటానని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు.
Also Read: ఏఐ డాక్టర్‌తో వైద్యసేవలు.. ఇంటి వద్దే 42 వైద్య పరీక్షలు.. ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్!