KCR LP Meeting : చాన్నాళ్ల తర్వాత కేసీఆర్.. భారతీయ రాష్ట్ర సమితి నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో.. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో.. రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో పార్టీ గొంతును వినిపించాలని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. పార్టీపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళుతుందన్న బీఆర్ఎస్ అధినేత.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న అంశాలపై పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాలని సూచించారు. అనేక విషయాల్లో సభలో వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు, సలహాలు అందించారు.
బీఆర్ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభలకు హాజరు కావాలని సూచించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుల్ని సభలో లేవనెత్తాలని, ఏవైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వెంటనే ప్రశ్నించాలన్నారు. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీ మీద, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద అనేక నిందలు, విమర్శలు వస్తున్నాయని.. వాటికి సరైన సమాధానం ఇవ్వాలన్నారు. అలా చేయకపోతే.. ప్రజల్లోకి పార్టీ మీద వ్యతిరేకత వచ్చే ముప్పుందని అన్నారు.
ప్రస్తుతం రాష్ర్టంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్న మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ఎండిన పంటలు, అందని కరెంటు, సాగునీరు కొరత, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై ప్రశ్నల్ని లేవనెత్తాలని సూచించారు. ముఖ్యంగా.. వేసవి వచ్చేసిన కారణంగా మారుమూల పల్లెలకు అందించాల్సిన మంచి నీటి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్న బీఆర్ఎస్ అధినేత.. ఎక్కడైనా సమస్యలు ఉంటే అసెంబ్లీలో పోరాడాలని సూచించారు.
రిజర్వేషన్ల అంశంలో పార్టీ విధానానికి అనుగుణంగానే నడుచుకోవాలని సూచించిన కేసీఆర్.. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరు పై మాట్లాడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ పెండింగ్, పీఆర్సీ అమలు పై అసెంబ్లీ, మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై ప్రశ్నించాలని, ఆరు గ్యారంటీ ల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని పరిశీలించాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.
విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదల చేయకపోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు సహా తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ.. తన పార్టీ నేతలకు సూచించారు. దళిత బంధును నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీ అమలు కోసం అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్ని, వారి కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని.. వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
కాగా… అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన లెజిస్లేటీవ్ పార్టీ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశంలో నిర్ణయించిన పార్టీ నేతలు..
సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజా సమస్యల మీద పోరాడేందుకు ఒకరికొకరు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. అందు కోసం డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.