Amrutha Pranay: 2018లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈ రోజు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్యకు సంబంధించి మొత్తం 8 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఏ1 అయిన అమృత తండ్రి మారుతి రావు విచారణ జరుగుతుండగానే హైదరబాద్ లో ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మిగతా ఏడుగురిలో ఏ2, హంతకుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా ఇతర దోషులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్డు తీర్పు వెల్లడించింది. ఈ కేసు తీర్పుపై ప్రణయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసిన విషయ తెలిసిందే.
కోర్టు తీర్పు తర్వాత అమృత మీడియా ముందుకు రాలేదు. ఇన్ స్టా పోస్టులకు మాత్రమే పరిమితం అయ్యారు. నిన్న ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను పోస్టు చేశారు. రెస్ట్ ఇన్ పీస్ అని నిన్నటి డేట్ తో ఆమె పోస్ట్ చేశారు. అయితే ఈరోజు మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు.
ఏడేళ్ల తర్వాత న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించిందని అన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసు తనకు మద్దతు ఇచ్చిన పోలీస్ శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన బిడ్డ భవిష్యత్తు కోసం తను ప్రెస్ మీట్ నిర్వహించడం లేదని.. తమను అర్థం చేసుకోగలరు అని అమృత పోస్ట్ చేశారు.
కేసు తీర్పుపై నిన్న ప్రణయ్ తండ్రి మాట్లాడారు. ‘ఈ తీర్పు వల్ల ప్రణయ్ తల్లిదండ్రులకు వచ్చే లాభం ఏం లేదు. ఏదైనా చర్చల ద్వారా మాట్లాడాలి కానీ చంపుకుంటూ పోతే లాభం లేదు. కొడుకు లేని బాధ తల్లిదండ్రులకే తెలుసు. బాబు లేని లోటు మాకు.. భర్త లేని లోటు అమృతకు.. తండ్రి లేని లోటు నా మనవడికి మాత్రమే తెలుసు. తొందరపాటు చర్యలకు పోకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే ఈ రోజు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో పుట్టిన పిల్లలను చంపుకోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు. కేసు శిక్ష పడే విషయంలో ఎంతో కృషి చేసిన అప్పటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ కు, మా లాయర్‌కి ధన్యవాదాలు’ తెలియజేశారు.
ALSO READ: Amrutha Pranay: అమృత ప్రణయ్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఎవరి దగ్గర ఉంటోంది?