Kcr in silent mode on telangana floods..not active : ఒక్కోసారి అనుకోకుండా అందివచ్చిన అదృష్టాన్ని కూడా కొందరు ఉపయోగించుకోలేకపోతుంటారు. ఎలాంటి పరిస్థితిలో స్పందించాలో..ఎలాంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా వేరే ఎవ్వరికీ తెలియదని అంటారు. అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు కనిపించడంలేదు గులాబీ నేత విషయంలో. వైరాగ్యమూ లేక అనాసక్తో కేసీఆర్ మాత్రం ప్రతిపక్ష నేతగా తన విధులను మర్చిపోయారనిపిస్తోంది అంటున్నారు విమర్శకులు. ఇటీవల బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి రావడానికే మొగ్తు చూపడం లేదని పార్టీ వర్గాలే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
అవకాశం ఉన్నా విమర్శలు చేయడం లేదు
తీరిగ్గా ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది కదా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు అని భావిస్తున్నారో ఏమో ఎక్కడా స్పందించడం లేదు కేసీఆర్. అయితే మొన్నటి దాకా రుణమాఫీపై గొంతు చించుకున్నారు హరీష్ రావు. అది సాధ్యం కాదంటూ ఛాలెంజ్ కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దానిని సాధ్యం చేసి చూపారు. మామూలుగా ప్రతిపక్ష నేతలు చిన్న రంధ్రం దొరికితే చాలు పెద్ద సొరంగమే చూపిస్తారు. ప్రభుత్వం నుంచి ఏ చిన్న తప్పు జరిగినా అందివచ్చిన అవకాశాన్ని వదులుకోరు. కానీ కేసీఆర్ అండ్ కో వ్యవహారం చూస్తుంటే మొద్దు నిద్ర పోతున్నట్లుగా ఉందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. గత నాలుగు రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాలలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం మున్నేరు వాగు విధ్వంసంతో సహాయక పనులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
సమాయక చర్యలేవి?
ఇలాంటి పరిస్థితిలో ప్రతిపక్ష నేతలు పార్టీ కార్యకర్తలను సహాయక కేంద్రాలకు పంపించాలి. అక్కడి ప్రజలకు తమ సహాయక చర్యలతో దగ్గరవ్వాలి. అవసరమైతే తమ డబ్బును ఖర్చుపెట్టి వారి ఆకలిని తీర్చాలి. అసలు ఇప్పటిదాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా వరద ప్రాంతాలను పర్యటించారా అంటే లేదనే సమాధానం వస్తోంది. ప్రజలతో కలిసి అధికార పక్షంపై ప్రతిదాడులను చేయవలసిన సమయంలో కాలు తీసి బయట కూడా పెట్టడం లేదు. కనీసం ఆయా నియోజకవర్గ నేతలను సమాయత్తం చేసి వరద ప్రాంతాలలో వారిని పర్యటించమని చెప్పే దిక్కు కూడా లేదు. ఇవి చాలవన్నట్లు ఇంట్లో కూర్చుని తెలంగాణ మంత్రులను, ముఖ్యమంత్రిని వారి పనితీరు బాగాలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజకీయాలు అవసరమా?
ఇప్పుడు రాజకీయాలు చేయడం కన్నా..వరద బాధితులకు సాయం చేయడమే మిన్న అని పార్టీ వర్గాలు గోల పెడుతున్నాయి. అగ్ర నేతలు అయివుండి వారి ప్రవర్తనకు విసిగిపోతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి నుంచి బయటపడాలి..పైగా వచ్చేవి స్థానిక ఎన్నికలు ఇలాంటి సమయంలో గులాబీ నేతలు తమకేమీ పట్టనట్లు, అసలు ఇది తమ రాష్ట్రమే కానట్లుగా ప్రవర్తిస్తున్నారని పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు కేటీఆర్ పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబుపై వరద సహాయక పనులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వీళ్లు ఇంకెప్పటికీ మారరా అంటూ తలలు పట్టుకుంటున్నారు.