KCR Emotional: హఠాన్మరణం చెందిన మాగంటి గోపీనాథ్ డెడ్‌బాడీని చూసి మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని మాగంటి నివాసానికి ఆయన వచ్చారు. భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. అదే సమయంలో నివాళి అర్పించేందుకు వచ్చారు లోకేష్ దంపతులు. అనంతరం, కేసీఆర్, లోకేష్ దంపతులు కలిసి మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంత బాధపడుతున్న మాగంటి గోపినాథ్.. ఉదయం ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు మాగంటి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దాంతో అక్కడి నుంచి మాదాపూర్‌లోని నివాసానికి మృతదేహాన్ని తరలించారు.
మాగంటి గోపినాథ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఇటు హరీష్‌రావు, కేటీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. మాగంటి కుటుంబసభ్యులను ఓదార్చారు.
హైదర్‌గూడలో 1963, జూన్2న జన్మించారు మాగంటి. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి. చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. వెంకటేశ్వర ట్యుటోరియల్స్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన… 983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. మాగంటికి ముగ్గురు పిల్లలు. కుమారుడు వత్సల్యనాథ్ కాగా ఇద్దరు కూతుర్లు అక్షర నాగ్, దిసిర. 1983లో టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాగంటి.. 1985 నుంచి 1992 మధ్య తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987-1988 మధ్య హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988 నుంచి 1993 మధ్య వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు మాగంటి.
Also Read: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్
2014లో తొలిసారి టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.