Revanth Cabine Expansion: ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఆయన కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. వారిలో శ్రీహరి ముదిరాజ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ కేబినెట్ విస్తరణ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గురు నేతలు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న గవర్నర్, వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా చేరింది. వివేక్, శ్రీహరి, లక్ష్మణ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు బీసీల కోటాలో శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు చోటు దక్కనుంది. డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్‌ను ఎంపిక అయినట్టు సమాచారం. సామాజిక న్యాయాన్నిదృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం డిసైడ్ అయ్యింది.
దాని ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తొలి నుంచి సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు బలంగా వినిపించాయి. ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: మేయర్ గద్వాల విజయలక్ష్మి షాక్.. అర్థరాత్రి బెదిరింపు కాల్స్
గడిచిన నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మంత్రివర్గం విస్తరణపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. అధిష్టానం నుంచి వచ్చిన సూచనలు, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సుధీర్ఘంగా చర్చించారు ఆమె.
సామాజిక వర్గాలతోపాటు పార్టీని అంటిపెట్టుకున్న దాదాపు డజనుపైగా నేతల పేర్లు బయటకువచ్చాయి. చివరకు ఆరుగురు పేర్లను అధిష్టానం వద్దకు పంపారట మీనాక్షి. సామాజిక కోణంలో పరిశీలించిన తర్వాత ఆ ముగ్గురికి ఆమోదముద్ర వేసినట్టు ఢిల్లీ వర్గాల మాట. అయితే చివరి నిమిషంలో ఎవరైనా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తెలంగాణ కాంగ్రెస్‌లోని చాలామంది నేతలు తమకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. తొలుత పార్టీ వైపు చేయాల్సినదంతా చేశారు. ఢిల్లీ స్థాయిలో చేస్తున్నారట. కేబినెట్ విస్తరణపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లతో పలుమార్లు కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరిపింది.
అందరి అభిప్రాయాలు విన్న తర్వాత శనివారం తన అభిప్రాయాన్ని అధిష్ఠానం బయటపెట్టినట్టు సమాచారం. ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉండనున్నాయి. వీటితోపాటు చీఫ్ విప్ పదవి భర్తీ కసరత్తు మొదలైంది. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీపడుతున్నవారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.