Attack On Collector : గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏకంగా జిల్లా పాలనాధికారిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడికి కారణాలను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు.. విస్తుగొలిపే అంశాలు తెలుస్తున్నాయి. బయటకు వస్తున్న విషయాలు పోలీస్ అధికారులతో పాటు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. భూసేకరణ అంశాన్ని అడ్డుగా పెట్టుకుని.. రైతుల పేరుతో ప్రతిపక్ష పార్టీ చేసిన కుట్ర కలకలం రేపుతోంది. కాగా.. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక కీలకాంశాలను చేర్చారు.
లగచర్ల భూ సేకరణ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కుట్ర బయటపడింది. ఈ దాడుల వెనుక ఏకంగా.. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణాధికారి, మాజీ మంత్రి కేటీఆర్ పేరు ప్రస్తావన రావడం సంచలనంగా మారింది. ఆయన ఆదేశాల మేరకే.. అధికారులపై దాడులకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తంగా 46 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. ఏకంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి అరెస్ట్ చేశారు. దాంతో.. రాజకీయ కుట్రగా మారిన ఘటనలో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే.. కేటీఆర్ పాత్ర బయటపడడం సంచలనం సృష్టి్స్తోంది.
తొలుత దాడిలో పాల్పడ్డారని అనుమానించిన వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసుల.. వారిలో దాడి గురించి తెలియని, అందులో పాల్గొననవారిని విడిచిపెట్టేశారు. తర్వాత.. దాడితో నేరుగా, పరోక్షంగా సంబంధాలున్న వారిని పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి స్టెట్మెంట్లు ఆధారంగా, ప్రధాన నిందితుడు భోగమోని సురేశ్ రాజ్ కాల్ డేటాను విశ్లేషణ ఆధారంగా.. పట్నం నరేంద్ర రెడ్డి పాత్రను గుర్తించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని రాష్ట్రం అంతటా రాజకీయం కోసం వాడుకోవాలని చూసిన బీఆర్ఎస్ నాయకులు… రైతుల్ని ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినట్లు గుర్తించారు. పట్నం నరేంద్ర అయితే.. దాడితో నేరుగా సంబంధం ఉన్న వారితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు.
అధికారుల్ని చంపినా తాము చూసుకుంటామని.. తాను, తన పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. పైగా.. అమాయక రైతుల్ని ఉసిగొల్పి, ప్రజాభిప్రాయ సేకరణ చేసే చోటకి వెళ్లకుండ అడ్డుకున్నారని తేలింది. వారి అనుచరుడిని పంపించి.. కలెక్టర్, అధికారుల్ని రప్పించుకుని.. విచక్షణారహితంగా దాడికి దిగినట్లు గుర్తించారు. అసలు నిందితుల్లో చాలా మందికి అసలు భూములు లేవనే సంచలన విషయాన్ని పోలీసు డీజీ వెల్లడించారు. కొందరికి ఉన్నా.. వారి భూములు భూసేకరణ జాబితాలో లేవని తెలిపారు. దాంతో.. దీని వెనుక కుట్ర కోణం ఉందని.. పక్కాగా చెబుతున్నారు.
ప్రాథమిక విచారణలోనే పట్నం నరేంద్ర రెడ్డి పేరు రావడంతో.. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు మరింత విస్తుగొలిపే అంశాలు తెలిశాయి. ఈ కుట్రలో ఏకంగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణాధికారి కేటీఆర్ పాత్ర బయటపడింది. ఈ విషయాన్ని పట్నం చెప్పినట్లుగా పోలీసు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే తాను రైతుల్ని ఉసిగొల్పినట్లు పట్నం నరేంద్ర అంగీకారించారు. పోలీటికల్ మైలేజ్ కోసమే ఇదంతా చేసినట్లు తెలిపారు.
Also Read : 20 లక్షల ఇళ్లు కట్టిస్తాం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు తెలిపిన పట్నం నరేంద్ర.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం, ప్రభుత్వ పరువు తీయడంతో పాటు.. విషయాన్ని పెద్దది చేసి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసినట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది.