Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఛార్టెడ్ అకౌంటెంట్ పనిచేశారు. రామచంద్ర పిళ్లై వద్ద కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా బుచ్చిబాబు వ్యవహరించారని ఆరోపణలున్నాయి.
మంగళవారం రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం బుచ్చిబాబును రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహరంపై గతంలోనూ సీబీఐ బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించింది. అలాగే అనేకసార్లు ఆయనను ఢిల్లీకి పిలిచి సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
గతేడాది సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీలు సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో హైదరాబాద్ దోమలగూడ అరవింద్‌నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఎమ్మెల్సీ కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి రిజస్టర్ట్ అడ్రస్‌కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం అనుమానాలకు దారితీసింది. కవితతో కలిసి బుచ్చిబాబు దిగిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆప్ నేతల తరఫున సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులు విజయ్ నాయర్ సేకరించారని ఈడీ నిర్దారించింది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ , అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు. ఆ గ్రూప్‌నకు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.