Cm Revanth Reddy: తెలంగాణలో డైట్ ఛార్జీలను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ గురుకుల పాఠశాల విద్యార్థులు నేడు సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Also read: నేను మామూలు హోం మంత్రిని కాదు.. మక్కెలు ఇరగ్గొట్టే హోం మంత్రిని
వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత అలవరుచుకోవాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించడం కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని చెప్పారు.
సాంకేతిక నైపుణ్యంతో పాటూ ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కూడా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. యువతకు స్కిల్స్ కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత ఉండటంతో ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా టీచర్ల నియామకం సైతం వేగంగా చేపట్టింది. ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టడంతో మేధావులు సైతం ప్రశంసిస్తున్నారు.