Ap Minister Anitha : ఆంధ్రా పాలిటిక్స్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల వార్ నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఓ సంఘటనపై ఇరు పక్షాలు ఆరోపణలు చేసుకుంటూనే ఉంటాయి. అయితే.. ఇటీవల హోం మంత్రిత్వ శాఖలో నేరాలపై విచారణ, కేసులు నమోదు సహా, నిందితులపై చర్యలు ఇంకా వేగవంతం కావాలని, గత ప్రభుత్వంలోని తీరు ఇంకా మారలేదంటూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దాంతో.. కూటమి ప్రభుత్వంలో చీలికలు అంటూ విపక్ష పార్టీలు కొత్త గానం అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్ లోకి వచ్చారు. హోం మంత్రిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. వాటిపై.. ఘాటుగా సమాధానమిచ్చిన హోం మంత్రి అనిత, తాను ఎలాంటి మంత్రినో వినండి అంటూ.. కొన్ని విషయాల్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అందులో.. అంబటి రాంబాబును ట్యాగ్ చేస్తూ.. అనేక వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబు గారు.. నేను మైక్ ముందు హోంమంత్రినే కాదు.. మాతృమూర్తులతో సమానమైన స్త్రీజాతిని అగౌరపరుస్తూ అసభ్యంగా మాట్లాడే వారి మక్కెలు ఇరగగొట్టించే హోం మంత్రిని అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ భావజాలంతో లాఠీ ఝులిపించే నేరస్తులకు గుణపాఠం చేప్పే ధైర్యం ఉందన్న హోం మంత్రి అనిత.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపైనా గురి పెట్టారు. వావివరుసలు లేకుండా ఆడపడుచులపై అచ్చోసిన ఆంబోతుల్లా సోషల్ మీడియాల్లో విరుచుకుపడే విపరీతాలని గట్టిగా ఎదిరించే విపత్తునిర్వహణ శాఖ మంత్రిని అంటూ హెచ్చరించారు. గతంలో తానూ.. ఓ సారి వైసీపీ సోషల్ మీడియాకు టార్గెట్ గా మారి, అనేక పోస్టుల్లో బాధితురాలిని అని గతంలో ఓ సారి చెప్పిన వంగలపూడి అనిత.. ఆ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
పైకి వేషధారణ, వస్త్రధారణ మారినా లోపల బుద్ధిమారని ఉగ్రవాద మనస్తత్వం కలిగిన వారితో చిప్పకూడు తినిపించే ఆత్మాభిమానం కలిగిన మహిళా మంత్రిని.. అంటూ ప్రస్తుత రాజకీయాల్లోని కొంత మందిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఛీడపురుగుల్లా మారి..చిన్నారులు, మహిళలు, వృద్ధులనే తేడాలేకుండా ప్రవర్తించే ఉన్మాద, తీవ్రవాదులను చట్టప్రకారం కఠిన శిక్ష వేయించే సంకల్పమున్న హోంమంత్రిని కూడా అంటూ.. అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు.
Also Read :ఢిల్లీ పర్యటనలో పవన్… అమిత్ షాతో భేటీ.. వీటిపైనే చర్చ!
కాగా.. హోం మంత్రి అనిత తన కూటమిలోనే వ్యతిరేకత ఎదుర్కొంటోంది అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆమె ఓ అసమర్థ హోం మంత్రి అన్న అంబటి.. ఆ మాట తాను అనడం లేదని, కూటమి నేతల వ్యాఖ్యలే అలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అనితతో పాటే, కూటమిలోని కీలక పక్షమైన పవన్ కళ్యాణ్ పైనా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరుగుతుంటే వెళ్లని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏం తొందర వచ్చిందని సరస్వతి భూముల దగ్గరకు వెళుతున్నారు అని ప్రశ్నించారు. కేవలం జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయంగా కక్ష సాధింపు చేసేందుకే.. అలా చేస్తున్నారంటూ విమర్శించారు.