Khammam News: భార్యాభర్తల అనుబంధం అంటేనే ఒక పవిత్ర బంధం. అర్థం చేసుకొని జీవిస్తే.. ఇంతటి అనుబంధం, ఆప్యాయత, ప్రేమానురాగాలు మనకు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించవు. భర్తలో సగభాగం భార్య అనే మాట వినే ఉంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం భార్యలో సగ భాగం భర్తకు అందించి, భార్యాభర్తల అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
వివాహం సమయంలో భర్త వేలు పట్టుకొని ఏడడుగులు నడిచిన ఆమె, ఏకంగా భర్త కోసం అవయవదానం చేసి తమ అనుబంధాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో జరిగింది. ఈర్లపూడి గ్రామానికి చెందిన శ్రీనుకు, జూలూరుపాడుకు చెందిన లావణ్యతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు ఆడపిల్లలు సంతానం కాగా, శ్రీను ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
దురదృష్టవశాత్తు శ్రీను అనారోగ్యంకు గురికాగా, పలు వైద్యశాలలకు వెళ్లి శ్రీను వైద్య చికిత్స చేయించుకున్నారు. లక్షల డబ్బులు ఖర్చయ్యాయి కానీ.. వ్యాధి మాత్రం నయం కాలేదు. చివరకు సికింద్రాబాద్ లోని ఓ వైద్యశాలకు వెళ్లిన శ్రీనుకు అసలు విషయాన్ని వైద్యులు తెలిపారు. శ్రీను కు తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని, అప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు.
తన భర్త ఆరోగ్య స్థితి తెలుసుకున్న భార్య లావణ్య.. భర్తను రక్షించుకునేందుకు స్వయంగా తన కాలేయం ఇచ్చేందుకు ముందడుగు వేశారు. భర్త ప్రాణాలను నిలబెట్టుకోవాలన్న ఆశతో లావణ్య శరీరం నుండి 65% కాలేయాన్ని తీసి వైద్యులు శ్రీనుకు అమర్చారు. ఈనెల 16వ తేదీన శస్త్ర చికిత్స పూర్తి చేయగా, శ్రీను ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది.
Also Read: Rahul Gandhi on Adani: అదానీ దేశసంపద కొల్లగొట్టాడు.. ఆయన వెనకుంది మోడీనే: రాహుల్ గాంధీ
తమ పవిత్ర బంధాన్ని నిలబెట్టుకునేందుకు లావణ్య చేసిన సాహసాన్ని.. శ్రీను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. నేటి కాలంలో భర్త కోసం భార్య అవయవదానం చేయడం అరుదైన ఘటనగా, నాతిచరామి అన్న పదానికి నిజమైన అర్థం ఈ దంపతులేనంటూ స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.