Kingfisher Beer: బీర్ బాటిల్ ఓపెన్ చేస్తే చల్లటి మత్తు గాలి వస్తుందని అందరూ ఊహిస్తారు. కానీ వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ ఓపెన్ చేయగానే.. మత్తు కాదు, ఆశ్చర్యం కలిగించే సర్ప్రైజ్ ఎదురైంది. గాజు గ్లాస్‌లో బీర్ పోసుకుంటూ చూస్తే, బుడగల మధ్య తేలుతూ ఉన్నది బీర్ ఫ్లేవర్ కాదు.. ఓ చిన్న ప్యాకెట్.. అదీ సరిగ్గా సోంపు ప్యాకెట్. దాంతో అక్కడ ఉన్నవాళ్లంతా బీర్ తాగామా.. లేక విందు భోజనమా? అని నవ్వుకుంటూనే, ఈ ఘటన వెనక అసలు సంగతేంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపారు. మొత్తం మీద ఈ ఘటన బీరు ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.
వరంగల్‌లో వింత ఘటన
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలోని ఒక వైన్స్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కస్టమర్ బీర్ బాటిల్ కొనుగోలు చేసి ఇంటికెళ్లి ఓపెన్ చేశారు. బీర్ పోస్తుండగా, అందులో ఏదో వింత వస్తువులా కనిపించడంతో బాగా గమనించారు. దగ్గరగా చూసేసరికి.. అది సోంపు ప్యాకెట్ అని తేలింది.
సోంపు ప్యాకెట్ బీర్‌లో ఎలా వచ్చిందో?
ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని కలయిక ఇది. బీర్ తయారీ, బాటిలింగ్ ప్రాసెస్‌లో ఇది ఎలా చేరిందో అనేది మిస్టరీగా మారింది. కొందరు ఇది తయారీ లోపం కావచ్చని అనుకుంటే, మరికొందరు అయితే బాటిల్ షాపుకి వచ్చేముందే ఎవరైనా కావాలనే ఇలా చేశారేమోనని అనుమానిస్తున్నారు.
సోషల్ మీడియాలో హల్‌చల్
ఈ ఘటన ఫోటోలు, వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఇది కొత్త ఫ్లేవర్ కింగ్ ఫిషరా? అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతుంటే, ఇది కస్టమర్ హెల్త్‌కి హానికరం.. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు సీరియస్‌గా స్పందిస్తున్నారు.
అధికారుల స్పందన
స్థానిక ఎక్సైజ్ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బాటిల్ ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుండి సరఫరా అయిందన్న వివరాలను సేకరిస్తున్నారు. అలాగే, అదే బ్యాచ్‌లో ఉన్న ఇతర బాటిల్స్‌ను కూడా చెక్ చేస్తున్నారు. తయారీదారులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది.
Also Read: Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!
కస్టమర్ ఆందోళన
బీర్ అనేది చల్లగా, ఫ్రెష్‌గా, హైజీనిక్‌గా ఉండాలని కోరుకునే వారు.. ఈ ఘటన తర్వాత కొంత ఆందోళన చెందుతున్నారు. ఇకపై బీర్ బాటిల్ ఓపెన్ చేసే ముందు బాగా చెక్ చేసుకోవాలని సోషల్ మీడియాలో హెచ్చరికలు పెట్టుకుంటున్నారు.
ఈ ఘటన ఫుడ్ బివరేజ్ ఇండస్ట్రీలో క్వాలిటీ చెకింగ్ ఎంత ముఖ్యమో మరోసారి రుజువు చేసింది. తయారీ సమయంలో కఠినమైన ప్రమాణాలు పాటించకపోతే, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల కస్టమర్ సేఫ్టీ కోసం కఠిన నియమాలు, పర్యవేక్షణ తప్పనిసరి అని ఇది స్పష్టం చేసింది. అలాగే, చిన్న సంఘటన కూడా సోషల్ మీడియా శక్తితో క్షణాల్లో వైరల్ అవుతూ, అధికారుల దృష్టికి చేరగలదని ఈ ఘటన నిరూపించింది.
బీర్ బాటిల్‌లో సోంపు ప్యాకెట్ ప్రత్యక్షం అవ్వడం వినడానికి హాస్యాస్పదంగానే ఉన్నా, ఇది క్వాలిటీ కంట్రోల్‌పై పెద్ద ప్రశ్నార్థకమే. ఈ ఘటనతో బీర్ ప్రియులు మాత్రమే కాదు, సాధారణ వినియోగదారులూ.. మన గ్లాస్‌లో ఏముందఅని మరోసారి ఆలోచించేలా చేసింది.