హైదరాబాద్, స్వేచ్ఛ: మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మార్కింగ్ చేసిన ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసారంబాగ్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల ప్రజలను కలిసిన ఆయన, ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. నిర్వాసితుల ఇంటింటికీ తిరిగి ధైర్యం చెప్పారు.
Also Read: కేటీఆర్.. తప్పు నీదే.. కొండా సురేఖకు క్షణాపణలు చెప్పు: జగ్గారెడ్డి
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అప్పులు చేసి, ఏళ్ల తరబడి కష్టార్జితంతో ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు. 25, 30 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేశారని, అన్ని రకాల సదుపాయాలు కల్పించారని చెప్పారు. ఎప్పటినుంచో పన్నులు, కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారని, ఇప్పుడొచ్చి ఇళ్లు కూలగొడతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వాలి గానీ, కూల్చడం ఏంటని నిలదీశారు కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరుతో మోసం చేసే ప్లాన్‌ను కేసీఆర్ మొదలుపెట్టారని, అప్పట్లోనే దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ బెదిరిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బెదిరింపులకే లొంగలేదు, రేవంత్‌కు బెదురుతామా అంటూ వ్యాఖ్యానించారు. బస్తీల్లోకి బుల్డోజర్ వచ్చినా, గడ్డపార పెట్టినా ఊరుకోమని హెచ్చరించారు. బస్తీల్లో చాలామంది కిరాయికి ఉంటున్నారని, వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు అని ఊరించారని చివరకు టోపీ పెట్టారని విమర్శించారు. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ సాధ్యమా అని ప్రశ్నించిన కేంద్రమంత్రి, అన్ని డబ్బులు ఉన్నాయా అని అడిగారు. లేనిపోని మాటలతో ప్రజలను భయపెట్టడం కరెక్ట్ కాదని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోనే కబ్జాకోరులు ఉన్నారని విమర్శలు చేశారు.