– మూసీపై ప్రభుత్వ పెద్దలకు క్లారిటీ లేదు
– త్వరలో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం
– దోచుకోవడానికి తప్ప ఈ ప్రాజెక్ట్ ఎందుకు?
– మోదీని చూసి రేవంత్ భయపడుతున్నారు
– కేంద్ర పెద్దల కనుసన్నల్లోనే గవర్నర్ సంతకం పెట్టారు
– ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ స్పందించరా?
– ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, స్వేచ్ఛ: మూసీ అంశంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదని, లూటీఫికేషన్ ప్రాజెక్ట్ అంటూ సెటైర్లు వేశారు. శాసన సభలో ఎటువంటి చర్చ లేకుండా హైడ్రాపై ఆర్డినెన్స్ తెచ్చారని, కేంద్ర పెద్దల కనుసన్నల్లో గవర్నర్ సంతకం పెట్టారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర లేదన్న కేటీఆర్, తాను అసెంబ్లీలో అడిగినా కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే రేవంత్‌కు భయంగా పేర్కొన్నారు. మూసీ రీ డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకు కాబోతోందన్నారు.
Also Read: అప్పుడు ఆయన బెదిరించాడు.. ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నాడు అసెంబ్లీలో మూడు గంటల పాటు వివరణ ఇచ్చాం. కానీ, మూసీ సుందరీకరణపై ప్రభుత్వంలో ఉన్నవారికి తెలియదు. త్వరలో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. ముఖ్యమంత్రికి, మంత్రులకు సయోధ్య లేదు. లక్ష యాభై వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి గోపనపల్లిలో మాట్లాడారు. 10 నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ చేయలేదు. మూసీపై లంచ్ మోషన్ పిటిషన్లు వందల్లో వస్తున్నాయని న్యాయమూర్తి అంటున్నారు. 23 సార్లు ఢిల్లికి వెళ్లిన రేవంత్ రెడ్డి 23 పైసలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు’’ అని విమర్శించారు కేటీఆర్. వరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, రైతు రుణమాఫీ అయిపోయిందని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రబీ సీజన్ స్టార్ట్ అయింది, రైతు బంధు వెయ్యలేదన్నారు. 55 కిలో మీటర్ల మూసీకి కిలో మీటర్‌కు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారని, దీని వెనుక పెద్ద ప్లానే ఉందని ఆరోపించారు. ‘‘ప్రధాన ప్రతిపక్షంగా నేను ఒక్కటే అడుగుతున్నా, దొంగ చాటుగా ఎందుకు సర్వేలు చేస్తున్నారు. మూసీ సుందరీకరణ రాష్ట్రానికి ఏం లాభం. కాంగ్రెస్ పార్టీకి లాభం తప్ప. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి లాభం లేదు. లేక్ వ్యూ పెట్టాలంటే బిల్డర్లు భయపడుతున్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్ ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. పండుగ సంబురం లేకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లొడు పిలిచిన వస్తానన్న రాహుల్ గాంధీ ఎక్కడ దాక్కున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చచ్చిపోతుంటే ఆయనకు కనపడడం లేదా’’ అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
Also Read:కేటీఆర్.. నువ్వు సోయి ఉండి మాట్లాడుతున్నావా? : మహేష్ కుమార్ గౌడ్
కేటీఆర్‌వి.. చిల్లర మాటలు
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. అసలు మూసీపై బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని అడిగారు. నిర్వాసితులకు ప్రత్యమ్నాయంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. వీలు అయితే ప్రతిపక్ష బాధ్యతతో నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు పొన్నం.