హైదరాబాద్, స్వేచ్ఛ: హైడ్రాకు, రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటి? అసలు కేటీఆర్‌కు సోయి ఉందా అంటూ ఫైరయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ముందు కేసీఆర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని నిలదీశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలో 800 చెరువులను కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కబ్జా చేశారు కాబట్టే బీఆర్ఎస్ నేతలకు హైడ్రా అంటే భయం అంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మూసీ, హైడ్రా కూల్చివేతలు, రాహుల్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో కేటీఆర్ చెప్పాలి. ఆయన ఏం చదువుకున్నాడో అని అనుమానం వస్తోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు పూర్వవైభవం తెస్తాం’ అని తెలిపారు.
Also Read: కేటీఆర్.. తప్పు నీదే.. కొండా సురేఖకు క్షణాపణలు చెప్పు: జగ్గారెడ్డి
మూసీపై డీపీఆర్ సిద్ధం కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఈ సందర్భంగా ప్రశ్నించారు మహేష్ గౌడ్. 2016లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేస్తానని చెప్పి, ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్ధంగా ఉందని, ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నారని వివరించారు. బయటి రాష్ట్రాల వీడియోలను ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే హైడ్రా కూల్చి వేస్తోందని తెలిపారు. ‘హైడ్రా పని వేరు. మూసీ ప్రాజెక్ట్ వేరు’ అని చెప్పారు. మూసీ పక్కన అక్రమంగా ఉన్న కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నారని, ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు లక్షల రూపాయలు సోషల్ మీడియాకు ఖర్చు బెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరు మీద ఒక్క రూపాయి అనవసరంగా ఖర్చు పెట్టినట్లు ప్రూవ్ చేస్తే తాను మూసీలో దుకుతానని, లేదంటే కేటీఆర్ దూకాలని సవాల్ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్న ఆయన, త్వరలోనే అఖిల పక్ష మీటింగ్ పెడతామన్నారు.