Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో : రాష్ట్రంలో డెయిరీ సెక్టార్ అభివృద్ధి చేయడంలో భాగంగా ఈనెల 4వ తేదీన మెదక్ జిల్లా, తూప్రాన్‌లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్ లో సబర్ డెయిరీ భూమి పూజ, అమూల్ డెయిరీ ఏర్పాటు పేస్తున్న మొట్టమొదటి ఆధునిక ప్లాంట్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణకు మరో కీలక మైలురాయిగా మారనుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో పాడిపరిశ్రమ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, వ్యాల్యూ క్రియేషన్ పెంచడం, పాడి రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం చూసుకుంటే ప్రతిరోజు 5 లక్షల లీటర్ల పాలు, రోజుకు 200 మెట్రిక్ టన్నుల పెరుగు, రోజుకు 30 కిలో లీటర్ల మజ్జిగ, ప్రొబయోటిక్ మజ్జిగ, రోజుకు 30 కిలో లీటర్ల లస్సీ, రోజుకు 10 మెట్రిక్ టన్నుల పన్నీర్, రోజుకు 50 కిలో లీటర్ల ఐస్ క్రీమ్(భవిష్యత్ లో రోజుకు 1 లక్ష లీటర్లకు విస్తరణ), రోజుకు 3 మెట్రిక్ టన్నుల స్వీట్లు(భవిష్యత్ లో రోజుకు 5 మెట్రిక్ టన్నులకు విస్తరణ), రోజుకు 5 మెట్రిక్ టన్నుల బేకరీ ఐటమ్స్(బ్రెడ్, కుకీస్, రస్క్), రోజుకు 5 మెట్రిక్ టన్నుల నెయ్యి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 2028-29 నాటికి డెయిరీ కోఆపరేటివ్స్ ద్వారా పాల సేకరణను 50 శాతం పెంచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేంద్ర మంత్రి ఆగ్రహం..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషీ మాత ఆలయంపై జరిగిన దాడిని కిషన్ రెడ్డి ఖండించారు. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. హిందూ దేవాలయాల రక్షణను, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రజలను, వారి ప్రార్థనా మందిరాలను కాపాడటం ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత అని, కానీ, ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతమవుతున్నా రేవంత్ రెడ్డి సర్కారుకు కనీసం చీమకుట్టినట్టుగా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు పూర్తి బాధ్యత వహిస్తూ, ఆలయాలను, హిందువుల మనోభావాలను కాపాడటంలో విఫలమైనందుకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే, ఈ దాడులకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: తెలంగాణలో క్రీడా విప్లవం.. అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సర్కార్ ప్లాన్!