Vakiti Srihari: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం శుక్రవారం వీక్షించింది.
భారత జట్టుకు అభినందనలు
ఆసియా క్రీడల్లో సెపక్ తక్రా విభాగంలో భారత్ కాంస్య పతకం సాధించడంతో భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ‘భారత్ మాత కీ జై.. జై భీమ్’ నినాదాలతో భారత క్రీడాకారులను అభినందిస్తూ ప్రతినిధి బృందం వారిలో ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత జట్టు పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుల కృషి, పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం
ఆసియా క్రీడల పర్యటన ద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు, క్రీడాకారుల ప్రదర్శనలు, క్రీడా నిర్వహణకు సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి లభించింది. ఈ అనుభవాలు రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి దోహదపడతాయని బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read: మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!