BRS Party – Adani: మనం ఏం చేసినా కరెక్ట్.. అదే ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. గత ప్రభుత్వంలో ఎన్నో తప్పిదాలు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలివి. దీనికి కారణం ప్రభుత్వం ఏ పనిచేసినా కేటీఆర్ ఆయన టీం తప్పులు వెతికేందుకే ప్రయత్నించడమేనట. తాజాగా అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్ ను లాగి విమర్శలు చేయడంతో వారి దురుద్దేశం మరోసారి రుజువైందని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా దేశంలో ఏ సంస్థ అయినా రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని చట్టప్రకారం పెట్టుబడులు పెట్టే హక్కు ఉంది.
అదే విధంగా విరాళాలు కూడా ఇవ్వొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్ నుండి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. అయితే ఇటీవల అదానీపై అమెరికాలో అవినీతి ఆరోపణలతో కేసు నమోదైంది. దీంతో అదానీ ఆఫర్ చేసిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన ఇచ్చే విరాళాలు వద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. అయితే స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ గట్టిగా పట్టుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అదానీ కోసమే సీఎం పనిచేస్తున్నారని విమర్శలు కురిపించారు.
Also read: జమిలి ఎన్నికలు.. మోదీకి, చంద్రబాబు షాక్
ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీ సంస్థలకు కేటాయించిన ప్రాజెక్టుల వివరాలు బయటకు రావడంతో అడ్డంగా దొరికిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీ సంస్థలకు ఏకంగా ఐదు ప్రాజెక్టులు కేటాయించి ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరం. మామిడిపల్లిలో అదాని ఎల్ బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్స్ సంస్థలకే ఇచ్చారు.
అంతే కాకుండా బీఆర్ఎస్ హయాంలోనే మిసైల్ షెల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చారు. వీటితో పాటూ ఎలికట్టలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ సర్కార్ అదానీ గ్రూప్స్ కే కట్టబెట్టింది. రాష్ట్రంలో నిర్మించిన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులను సైతం అప్పటి ప్రభుత్వం అదానీ గ్రూత్స్ కే కేటాయించింది. వాటిలో ఖమ్మం – సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల- రేపెల్లవాడ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తికాగా ఖమ్మం- కోదాడ నేషనల్ హైవే పనులు 85 శాతం పూర్తయ్యాయి. వరంగల్ లో 750 కేవీ ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టును కూడా అదానీకే అప్పగించారు. దీంతో ఇన్ని ప్రాజెక్టులు అప్పగించి ఇప్పుడు విమర్శలు చేస్తారా? అని ప్రజలే బీఆర్ఎస్ ను ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది.