Mallika Sherawat: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఇట్టే ప్రేమలో పడిపోయి, అంటే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. కొంతమంది తమకంటే వయసులో చిన్న వారితో ప్రేమలో పడితే, ఇంకొంత మంది తమకంటే వయసులో రెండు రెట్లు పెద్ద వారితో ప్రేమలో పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఆ తర్వాత వారిని వివాహం చేసుకుంటున్నారా అంటే..? అదీ లేదు. కొంతకాలానికి బ్రేకప్ చెప్పి దూరమవుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ కూడా వచ్చి చేరింది. తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నట్లు తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ (Mallika Sherawat). ప్రియుడు ‘క్రిలీ ఆక్సన్ ఫాన్స్'(Cyrille Auxenfans)తో విడిపోయినట్లు తెలిపారు. “ఈ రోజుల్లో మనకు సెట్ అవుతాడని అనిపించే వ్యక్తి దొరకడం చాలా కష్టమైపోయింది. అతడితో బ్రేకప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నాకు పెళ్లిపై ఇప్పుడు ఆసక్తి లేదు. అలాగని వ్యతిరేకం కూడా కాదు. అది భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటుంది” అంటూ బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చింది మల్లికా షెరావత్. గతంలోనే విడిపోయినట్లు వార్తలు వచ్చినా.. ఆ రూమర్స్ ని నిజం చేసింది ఈ ముద్దుగుమ్మ..ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
మల్లికా బాల్యం, విద్యాభ్యాసం..
1976 అక్టోబర్ 24న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు మల్లికా షెరావత్. ఇకపోతే ఈమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ పేరు మీద చాలామంది హీరోయిన్స్ ఉండడంతో గందరగోళాన్ని నివారించడానికి తన పేరును మల్లికా గా పెట్టుకుంది. ‘షెరావత్’ అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటిపేరు. తన తల్లి తనకు ఇచ్చిన మద్దతు కారణంగానే తన తల్లి పేరును ఉపయోగిస్తున్నానని కూడా ఆమె తెలిపింది. మధుర రోడ్డు లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఈమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, మిరాండా హౌస్ నుండి తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది.
మల్లికా షెరావత్ వ్యక్తిగత జీవితం..
1997లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న సమయంలోనే, ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్ (Karan Singh Gil) ను వివాహం చేసుకుంది. ఇక నాలుగేళ్ల తర్వాత సినిమా రంగంలోకి రావడం కోసం భర్తకి విడాకులు ఇచ్చింది. అయితే విడాకులైన విషయం బాలీవుడ్లో తెలిస్తే తన పెరుగుదలకు అడ్డంగా మారుతుంది కాబట్టి తనకు పెళ్లయిందనే విషయాన్ని కూడా దాచిపెట్టిందట ఈ ముద్దుగుమ్మ. ఇక చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు కుటుంబంతో సంబంధాలు దెబ్బ తిన్నా సరే వాటిని కాదని ఇండస్ట్రీలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు కుటుంబంతో కలిసి ఉన్న విషయం తెలిసిందే. ఇక ‘మర్డర్’ సినిమా చూస్తే ఆమె నటనలో ప్రదర్శించిన తెగువకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె హాలీవుడ్ కి వెళ్లడానికి కూడా ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కబట్టే ప్రయత్నం చేస్తున్న ఈమెకు పెద్ద షాక్ కు తగిలిందనే చెప్పాలి.