Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని మెట్రో సేవలు లేని నగరంగా అస్సలు ఊహించలేము. అందుకే రోజూ లక్షల సంఖ్యలో నగరవాసులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రో ఛార్జీల పెంపు గురించి ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం కాస్త ఆలస్యంగానే వచ్చిందని చెప్పవచ్చు. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో ఈ నెల 17 నుండి చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫారసుల మేరకు ఎల్ అండ్ టి మెట్రో రైల్వే హైదరాబాదులో ప్రయాణించే వారికి టికెట్ ధరలను అప్‌డేట్ చేసింది. గతంలో ఉన్న రేట్లతో పోలిస్తే ఈ సరికొత్త ధరలలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ప్రయాణికులు తమ దూరాన్ని బట్టి ప్రయాణ ధరను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అసలు పాత ధరలతో పోలిస్తే పెరుగుదల ఎలా ఉంది? ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకుందాం.
గతం కంటే ఇప్పుడెంత ధర పెరిగిందంటే?
0 – 2 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 10 ప్రస్తుతం రూ. 12, 2 – 4 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 15 ప్రస్తుతం రూ. 18, 4 – 6 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 25 ప్రస్తుతం రూ. 30, 6 – 9 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 30 ప్రస్తుతం రూ.40, 9 – 12 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 35 ప్రస్తుతం రూ.50, 12 – 15 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 40 ప్రస్తుతం రూ.55, 15 – 18 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 45 ప్రస్తుతం రూ.60, 18 – 21 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 50 ప్రస్తుతం రూ.66, 21 – 24 కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 55 ప్రస్తుతం రూ.70, 24 కి పైగా కిలో మీటర్ల దూరానికి గతంలో రూ. 60 ప్రస్తుతం రూ.75 టికెట్ ధరలు నిర్ణయించబడ్డాయి.
మెట్రో ప్రయాణికులపై ప్రభావం
ఈ కొత్త టికెట్ రేట్లు అమలవడం ద్వారా రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు మొదలైనవారిపై కొంత ఆర్ధిక భారమవుతుంది. అయితే మెట్రో అధికారుల ప్రకారం, మెట్రో నిర్వహణ వ్యయం, రక్షణ, మౌలిక వసతుల నిర్వహణ పెరుగుదల వంటి అంశాల దృష్ట్యా ఈ పెంపు అవసరమయ్యిందని వారు పేర్కొన్నారు. దూరాన్ని బట్టి ధరలు వేరేలా ఉండటంతో ప్రయాణికులు ముందుగానే తమ ట్రావెల్ ప్లాన్‌ను అనుసరించుకోవాలి. ఇంకా సమాచారం కోసం వినియోగదారులు www.ltmetro.com వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.