Komatireddy Venkat Reddy: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. భారీ యువ చైతన్య ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో నల్లగొండ పట్టణం కిక్కిరిసింది. ఈ ర్యాలీకి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మట్టి రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయిస్తామని, నల్లగొండను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలించి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేదని, ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడడం సరికాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ అవినీతిని ఉతికి ఆరేస్తామని వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాలుగా అసెంబ్లీకి రాకుండానే నెలకు లక్షల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించిన మంత్రి, అవినీతిపై ప్రశ్నించిన సొంత కూతురినే పక్కన పెట్టారని అన్నారు. కల్వకుంట్ల కవిత అడిగిన వేల కోట్ల రూపాయల లెక్కలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తుచేసిన కోమటిరెడ్డి, జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ వంటి కీలక ప్రాజెక్టులకు పునాది వేశారని అన్నారు. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని తెలిపారు. రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతిక విప్లవాన్ని పరిచయం చేశారని పేర్కొన్నారు.
సోనియా గాంధీ త్యాగాల కుటుంబానికి ప్రతీక అని అన్నారు. ప్రధాని పదవి అవకాశాలు వచ్చినా దేశ ప్రయోజనాల కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులకు అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని.. ప్రవేశపెట్టి కోట్లాది పేదలకు 100 రోజుల పని కల్పించారని అన్నారు. అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు.. కుట్రలు చేస్తోందని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. జనవరి 5 నుంచి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉద్యమం జరుగుతుందని, అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Also Read: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ బీజేపీ మతతత్వ రాజకీయాలపై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నిర్వహించిన ఈ యువ చైతన్య ర్యాలీతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందని నాయకులు పేర్కొన్నారు.