Konda Surekha Episode: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో అసలు సీఎం మదిలో ఏమున్నదో? అని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండటంతో పార్టీ నేతల్లో విభిన్న రకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రెండు సార్లు అపాయింట్ మెంట్ కు ఆసక్తి చూపని సీఎం.. సడన్ గా రాఖీ డే రోజు ఆహ్వానం పలకడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కొండా సుష్మిత కాంట్రవర్సీ వ్యాఖ్యల తర్వాత వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాఫిక్ గా నిలిచింది. విదేశాల నుంచి సీఎం వచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై పెద్దగా స్పందించలేదు. హైకమాండ్ చూసుకుంటుంది అంటూ సీఎం సింపుల్ గా స్కిప్ చేశారు. కానీ ఆ తర్వాత సీఎంను కలిసేందుకు మంత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. సడన్ గా రాఖీ డే రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. పొలిటికల్ సర్కిళ్లను సీఎం డైలమాలో పడేశారు. ఈ వివాదం ముగిసినట్టేనా? రాఖీతో రాజీ అయ్యారా? సమస్య సమసినట్టేనా? అంటూ అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలోనూ డిఫరెంట్ స్టైల్ లో డిబెట్ లు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై మరింత క్లారిటీ రావాలంటే సెప్టెంబరు 2 వరకు వెయిట్ చేయాల్సిందేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ డాటర్ సుష్మిత చేసిన విమర్శలు ప్రత్యక్షంగా సీఎంతో పాటు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. అయితే ఈ అంశంలో చర్యలు తీసుకోవాల్సిందేనని ఇప్పటికే టీపీసీసీ తో పాటు క్రమ శిక్షణ కమిటీ కూడా ప్రత్యేక రిపోర్టులను ఏఐసీసీకి పంపించారు. అక్కడ రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. కేసీ వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకోనున్నారు. అయితే మంత్రి కొండా సురేఖ విషయంలో ఏఐసీసీ కూడా గుర్రుగా ఉన్నట్లు ప్రచారం ఉన్నది. తప్పనిసరిగా చర్యలు ఉంటాయనే సంకేతాలు రాష్ట్ర పార్టీకి అందాయి. ఈ నేపథ్యంలోనే సీఎం మౌనంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈ సున్నితమైన అంశంపై ఇన్వాల్వ్ కావడానికి సీఎం పెద్దగా ఆసక్తి చూపడం లేదని కూడా తెలుస్తోంది. పైగా బీసీ మహిళా.. ఇలాంటి సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఇరకాటంలో పడతామనే ముందు జాగ్రత్తలో సీఎం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే బీసీ సంఘాలు, పద్మశాలీ సంఘాలు కూడా మంత్రి కొండా సురేఖకు మద్ధతుగా సభలు, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి హాడావిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకునే వరకు రియాక్ట్ కాకూడదని సీఎం అలర్ట్ గా ఉన్నారు.
Also Read: క్రికెట్ మానేసి, ఇంట్లో కూర్చోవడం బెటర్..పాకిస్తాన్ జట్టు పరువు తీసిన తన్వీర్ అహ్మద్
కొండా ఫ్యామిలీ వైఖరిపై ఇప్పటివరకు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సడన్ గా రూట్ మార్చారు. ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి ఘాటైన వ్యాఖ్యలు చేసిన కొండా వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కసారిగా ‘గప్ చిప్’ అయ్యారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సంకేతాల వల్లే నాయకులంతా సైలెంట్ అయ్యారనే చర్చ ఉన్నది. హైకమాండ్ కూడా తాము నిర్ణయం తీసుకునే వరకు ఈ అంశంపై ఎవరూ స్పందించవద్దని చెప్పినట్లు తెలిసింది. అయితే పీసీసీ చీఫ్ దగ్గర్నుంచి మొదలు కొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వరకు ఈ ఎపిసోడ్ లో కొండా ఫ్యామిలీకి మద్ధతు లభించకపోవడం గమనార్హం.
ఇక సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అనంతరం ‘అన్న రేవంత్ ఆశీర్వాదాలు ఆడపడుచులందరికీ ఉంటాయి’ అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. పార్టీ, హైకమాండ్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో మంత్రి కొండా చేసిన కామెంట్లు సస్పెన్స్ లో పడేశాయి. సీఎం రేవంత్ కు కట్టిన రాఖీ ద్వారా వివాదానికి చెక్ పడ్డట్లే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం మాత్రం ఇప్పటి వరకు రీయాక్ట్ కాలేదు. కానీ తెలంగాణలోని పండుగలు, సాంప్రదాయాలు రాజకీయ, కుటుంబ బంధాలను మరింత దగ్గర చేస్తాయనే సామెతలతో పొలిటికల్ లీడర్లు తమ చర్చలను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రాఖీ డే రోజు సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మధ్య సంబంధం సామరస్యంగా ఉన్నదనే టాక్ వెలువడింది.
Also Read: నల్లాలు విప్పితే కంపుకొట్టే మురుగునీరు.. చందానగర్‌లో తాగునీటి కష్టాలపై ప్రజల నిరసన!