Steel Flyover: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు హెచ్ సిటీ కింద నిర్మిస్తున్న ఒక్కో ప్రాజెక్టు క్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాహనదారులు వినియోగిస్తున్న ఇందిరాపార్కు టూ ఆర్టీసీ క్రాస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జికి తోడు సైదాబాద్ లో మరో స్టీల్ ఫ్లై ఓవర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రాంతాల వారీగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి కొంత ఉపశమనం కల్గుతుంది. నిత్యం రద్దీగా ఉండే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ హాస్పిటల్ వరకు దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జి పనులు ముగిసి, బ్రిడ్జి ప్రారంభానికి సిద్దమైంది.
ప్రస్తుతం ట్రాఫిక్ లో చిక్కుకుని నరకాన్ని చూస్తున్న వాహనదారులకు ఈ స్టీల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే చంచల్ గూడ నుంచి ఓవైసీ హాస్పిటల్ దాక రయ్ రయ్ మని ప్రయాణించవచ్చు. సుమారు రూ. 620 కోట్ల వ్యయంతో మొత్తం 3.32 కిలోమీటర్ల పొడువున ఆరు లేన్లుగా నిర్మించిన ఈ స్టీల్ ఫ్లై ఓవర్ క్షేత్ర స్థాయిలో అనేక రకాల అడ్డంకులను అధిగమించి, ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. గత సర్కారు హయాంలో ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ)ని ప్రస్తుత ప్రభుత్వం హెచ్ సిటీగా సవరించిన సంగతి తెల్సిందే. నాటి నుంచి ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ స్టీల్ ఫ్లై ఓవర్ తో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా నేటితో ముగియనున్నాయి. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల పనులు పూర్తయ, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది.
Also read: స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!
ఈ రెండు ప్రాజెక్టులను తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు ఇటీవలే సీఎం వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం సుముఖతను వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఐఎస్ సదన్ లో ఉన్న ఓ దేవాలయం, మరో ప్రార్థన మందిరాలకు ఎఫెక్టు చేసేలా ఈ వంతెనను నిర్మిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేయటంతో పాటు పలు సార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. దీనికి తోడు స్థల సేకరణకు కూడా అనేక రకాల అడ్డంకులు ఏర్పడినా, అధికారులు ఎంతో వ్యూహాత్మకంగా వాటిని అధిగమించి, ఈ వంతెన పనులను ముందుకు తీసుకెళ్లారు. పనులు పూర్తయ్యేందుకు కమిషనర్ కర్ణన్ వీక్లీ ప్రాజెక్టుల రివ్యూ, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ డైలీ విజిట్ లే ముఖ్య కారణమని చెప్పవచ్చు.
ఓవైసీ హాస్పిటల్ వరకు సుమారు 210 మీటర్ల పొడువున అప్ ర్యాంప్ ను నిర్మించగా, అక్బర్ బాగ్ వద్ద డౌన్ ర్యాంప్ ను కూడా నిర్మించారు. ఈ స్టీల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ హాస్పిటల్ వరకు ఇక రాకపోకలు వేగంగా ముందుకు కదలనున్నాయి. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, సైదాబాద్, కంచన్ బాగ్ లో నెలకొన్న ట్రాఫిక్ తగ్గుముఖం పట్టి, వాహానాలు వేగంగా ముందుకు సాగేందుకు వీలు కల్గడంతో పాటు సగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓల్ట్ సిటీ, న్యూ సిటీల మధ్యనే గాక, న్యూ సిటీ నుంచి పలు శివారు ప్రాంతాలకు కూడా రాకపోకలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
Also read: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. కింగ్ 100 నుంచి బిగ్ అప్డేట్..వీడియో వైరల్!