Kondapur flyover :
⦿ రూ.446.13 కోట్లకు పెంపు
⦿ కొండాపూర్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి రోడ్డు విస్తరణకు మంజూరు
⦿ గతంలో రూ.435 కోట్లు కేటాయింపు
⦿ సవరించిన రాష్ట్ర ప్రభుత్వం
⦿ మున్సిపల్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, స్వేచ్ఛ : హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ వైపు నుంచి ఓఆర్ఆర్ వరకు ఆరు లేన్ల ఫ్లైవర్ (ఇరు వైపుల) నిర్మాణం, గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ నుంచి గ్యాస్ కంపెనీ గుండా గచ్చిబౌలి జంక్షన్ వరకు 120 అడుగుల మేర రోడ్డు విస్తరణ పనులకు గతంలో మంజూరు చేసిన రూ.435 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రూ.11.13 కోట్ల మేర స్వల్పంగా పెంచి మొత్తం రూ.446.13 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ విజ్ఞప్తిని జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే గతంలో మంజూరు చేసిన నిధులను సవరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక శాఖ అనుమతితో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వివరించింది. ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణ పనులకు అవసరమైన తదుపరి చర్యలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తీసుకుంటారని వివరించింది. కాగా ‘వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం’ (ఎస్‌ఆర్‌డీపీ) కింద ఈ ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనులను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఈ నిర్మాణాలకు పూర్తయితే నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తగ్గనున్నాయి.
ALSO READ : ఆక్రమణలను వదలొద్దు.. హైడ్రాకు బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు