Strange Rituals: వర్షం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. నెల ముందే రుతుపవనాలు పలకరించడంతో.. ఎంతో సంతోషంగా విత్తనాలు వేశారు. కానీ వర్షాలు సకాలంలో పడక విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేశామని ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు నిరాశలో కూరుకుపోయారు.
మృగశిర కార్తె పోయి ఆరుద్ర వచ్చినా.. వాన నీటి జాడ లేక రైతులు దిగాలు చెందుతున్నారు. నెలరోజుల ముందే పలకరించిన వరుణుడు ఇప్పుడు ముఖం చాటేయ్యడంతో వాన జాడకై ఆకాశం వైపు చూస్తున్నారు రైతులు.
జూన్ మూడవ వారంలో దాటుతున్నా వర్షాలు జాడ లేదు. వానల కోసం అన్నదాతలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తొలకరి పలకరించినా.. తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. దుక్కులు దున్నారు.. విత్తులు పెట్టారు. కానీ.. వర్షం చుక్క లేదు. దీంతో గ్రామాల్లోని రైతులు వరుణుడికి పిల్లలు, పెద్దలు కలిసి గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు తరతరాలుగా వరదపాసం అనే విలక్షణ ఆచారాన్ని పాటిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని.. దేవుని గుట్టపై ఈ వేడుక నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన పవిత్రమైన నైవేద్యాన్ని పెద్ద బండరాయిపై ఉంచి, గ్రామ పెద్దల నుంచి చిన్నారుల వరకు నాలుకతో నేలపైనే నాకుతారు. చేతులు ఉపయోగించరు. ఇది భూదేవిని ప్రసన్నం చేసుకుని వర్షాలను ఆకర్షిస్తుందని, భూమి సారవంతమై పంటలు పెరుగుతాయని వారి నమ్మకం.
Also Read: క్షుద్రపూజలు చేసి మాగంటిని నేనే చంపేశా..15 రోజుల్లో నిన్ను కూడా.. సంధ్య శ్రీధర్ రావు ఆడియో లీక్
వర్షాలు పడకపోతే.. పంటలు ముందుకు సాగవని రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలోని యువత వర్షాలు రావాలన్న ఆశతో వరదపాశం కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించాలంటే వరదపాశం నిర్వహించాల్సిందేనని చెబుతున్నారు. పూర్వీకుల నుంచి అనవాయతీగ వస్తుందని కొత్తూరు గ్రామస్తులు చెబుతున్నారు. వరదపాశం కార్యక్రమం వల్ల వరుణదేవుడు కరుణించి, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.