Tirumala News: తిరుమల భక్తులకు ఊహించని శుభవార్త. లడ్డూల కోసం ఇకపై ప్రత్యేకంగా కట్టాల్సిన అవసరం లేదు. కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ఆదివారం అమల్లోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.
తిరుమలలో భక్తుల కోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఇంకా తక్కువగానే ఉంటాయి. ఆ లోటు మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. రోజుకు 70 నుంచి 80 వేల మంది శ్రీహరిని దర్శించుకుంటారు. దర్శనానికి వచ్చే భక్తులకు అన్నిరకాల సేవలు చేయడమంటే మామూలు విషయం కాదు. టీటీడీ కత్తి మీద సామే. టెక్నాలజీతో వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడుతోంది.
కొద్దిరోజుల కిందట వెంకన్నకు విరాళాలు ఇచ్చేందుకు కియోస్క్‌లకు అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ద్వారా స్వామికి విరాళాలు ఇవ్వొచ్చు. ఈ విషయంలో టీటీడీ సక్సెస్ అయ్యింది. శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూల విషయానికి వద్దాం. దర్శనం టికెట్ మీద ఎలాగూ లడ్డూలు ఇస్తారు. అదనంగా లడ్డూలు తీసుకోవాలంటే విక్రయ కేంద్రంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చేది.
ఇదంతా ఒకప్పటి మాట. కౌంటర్లు రద్దీగా ఉంటే చాలా సమయం పట్టేది. తాజాగా కియోస్క్‌ల ద్వారా లడ్డూలు కొనుగోలు చేసే విధానాన్ని ఆదివారం నుంచి అమల్లోకి తెచ్చింది. కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకోవచ్చు. దర్శనం టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి లడ్డూలు పొందవచ్చు. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా తెలిపింది.
ALSO READ: వైసీపీకి పల్నాడు కష్టాలు.. జగన్ కు జీవితఖైదు తప్పదా?
టికెట్లు లేని భక్తులు ఆధార్ నెంబర్ ఉపయోగించి లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా భక్తులు సులభంగా తిరుమల లడ్డూలు పొందవచ్చు. తొలుత భక్తులు తమ దర్శనం టికెట్ నంబర్‌ను కియోస్క్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత ఎన్ని లడ్డూలు కావాలో ఆ సంఖ్యను ఎంపిక చేయాలి.
అంతా ఓకే అయిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. కియోస్క్ నుంచి రసీదు లడ్డూ కౌంటర్‌లో ఇస్తే చాలు మనం ఎన్నింటికి అయితే డబ్బులు చెల్లించామో ఆయా లడ్డూలను పొందవచ్చు. రద్దీ ఎక్కువగా ఉంటే వాటి సంఖ్యను పెంచాలని భావిస్తోంది.
తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్- కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లు ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను కియోస్క్‌ల ద్వారా పొందేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ. త్వరలో ఆ విధానం అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు అధికారులు.